16 July, 2026 | 5:06 PM

సీఆర్పీఎఫ్ బస్ తగులబెట్టిన అల్లరిమూక

19-06-2024 12:00 AM

ఇంఫాల్, జూన్ 18: జాతుల ఘర్షణతో ఏడాది కాలంగా రగిలిపోతున్న మణిపూర్‌లో అల్లరిమూకలు భద్రతా బలగాలను కూడా వదలటం లేదు. సీఆర్పీఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సును అల్లరిమూకలు సోమవారం రాత్రి తగులబెట్టారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని కంగ్‌పోక్‌పీలో ఈ దాడి జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపిన దుండగులు, వారందరినీ బస్సు దిగమని ఆదేశించారు. జవాన్లు బస్సు దిగగానే దానికి నిప్పు పెట్టారు. దీంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. కండ్లుముందే దౌర్జన్యం జరుగుతున్నా సీఆర్పీఎఫ్ సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. రాష్ట్రంలో అల్లర్లను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్న బలగాలే ఆ దాడులకు బాధితులుగా మిగలాల్సి వచ్చింది. ఈ దాడికి పాల్పడింది కుకీ తెగకు చెందినవారని రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఆ బస్సు మెయిటీ వర్గానికి చెందిన వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయ్యి ఉండటం వల్లనే తగులబెట్టారని చెప్పారు.