సింగరేణిలో పెరిగిన కార్పొరేట్ వైద్యం
- సంవత్సరానికి రూ.89.87 కోట్లు ఖర్చు
- 12 నెలల్లో 17,151 రిఫరల్స్..
- ఒక్క మార్చిలోనే రూ.11.38 కోట్లు
- జనవరి, మార్చిలో భారీగా పెరిగిన వైద్య ఖర్చులు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 9 (విజయక్రాంతి): సింగరేణి సంస్థకు సొంత ఆసుపత్రులు, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్న రోగుల సంఖ్య, అందుకోసం చేస్తున్న ఖర్చు భారీగా ఉన్నట్లు సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023- ఆర్థిక సంవత్సరంలో 12 నెలల్లో 17,151 మంది రోగులను రిఫర్ చేయగా.. కార్పొరేట్ వైద్యం కోసం ఏకంగా రూ.89.87 కోట్లు చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి. నెలకు సగటున సుమారు రూ.7.49 కోట్ల చొప్పున కార్పొరేట్ వైద్యానికి వ్యయం జరిగింది. అంటే రోజుకు సగటున సుమారు రూ.24.6 లక్షలు ఖర్చయినట్లు గణాంకాల ఆధారంగా వెళ్లడవుతోంది.
నెలల వారీగా ఖర్చు ఇలా..
నెలల వారీగా రిఫరల్ కేసులు, ఖర్చులు పరిశీలిస్తే.. ఏప్రిల్ 2023లో 1,074 రిఫరల్ చేయగా రూ.3.90 కోట్లు, మే 2023లో 944 రిఫరల్స్ కోట్లు, జూన్ 2023లో 1,192 రిఫరల్స్ కోట్లు, జూలై 2023లో 1,200 రిఫరల్స్ కోట్లు, ఆగస్టు 2023లో 1,818 రిఫరల్స్ కోట్లు, సెప్టెంబర్ 2023లో 1,370 కోట్లు, అక్టోబర్ 2023లో 1,113 రిఫరల్స్ కోట్లు, నవంబర్ 2023లో 1,338 రిఫరల్స్‌రూ.7.02 కోట్లు, డిసెంబర్ 2023లో 1,215 రిఫరల్స్ కోట్లు, జనవరి 2024లో 1,953 రిఫరల్స్ కోట్లు, ఫిబ్రవరి 2024లో 1,347 రిఫరల్స్ రూ.7.31 కోట్లు, మార్చి 2024లో 2,587 రిఫరల్స్ కోట్లు ఖర్చు అయ్యాయి. మొత్తంగా 17,151 రిఫరల్ కేసులకు గాను రూ.89.87 కోట్లు ఖర్చు చేశారు.
మార్చిలోనే రూ.11.38 కోట్లు
కార్పొరేట్ వైద్య ఖర్చుల్లో మార్చి నెల అత్యధికంగా ఉంది. ఆ నెలలో 2,587 మందిని రిఫర్ చేసి రూ.11,38 కోట్లు ఖర్చు చేశారు. జనవరిలో 1,953 మందికి రూ.10,59 కోట్లు, ఆగస్టులో 1,818 మందికి రూ.9 కోట్లు అక్టోబర్లో 1,113 మందికి రూ.9,24 కోట్లు ఖర్చు చేశారు. మరోవైపు ఏప్రిల్‌లో 1,074 మంది రిఫరల్స్‌కు రూ.3.90 కోట్లు ఖర్చు కాగా, జూన్‌లో 1,192 మందికి రూ.4.37 కోట్లు ఖర్చయింది.
రిఫరల్స్‌పై ప్రశ్నలెన్నో!
2023 ఉత్పాదక సంవత్సరంలో సింగరేణి సంస్థలో 41,837 మంది శాశ్వత ఉద్యోగులు, కార్మికులు ఉండగా, వారిలో ఒక ఏడాదిలోనే 17,151 రిఫరల్స్ ద్వారా దాదాపు రూ.90 కోట్ల కార్పొరేట్ వైద్య వ్యయం జరగడం సింగరేణి వైద్య వ్యవస్థపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. సింగరేణి సంస్థ పరిధిలో కొత్తగూడెం కార్పొరేట్ ఆసుపత్రితో పాటు భూపాలపల్లి, బెల్లంపల్లి, హైదరాబాద్, మణుగూరు, రామగుండం, రామకృష్ణాపూర్, ఇల్లందు తదితర ప్రాంతాల్లో సంస్థ ఆసుపత్రులు ఉన్నాయి.
ఆయా ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. 2024 నాటి లెక్కల ప్రకారం సంస్థ పరిధిలో మొత్తం 173 మంది వైద్యులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. సంస్థకు సొంత ఆసుపత్రులు, వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో రోగులను బయటకు రిఫర్ చేయాల్సిన అవసరం ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగరేణి ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలతో పాటు వైద్య పరీక్షలు, వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలు నిర్వహించే సౌకర్యాలు ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో రోగులను కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించడం పై అనేక అనుమానాలకు దారతీస్తోంది. ప్రస్తుతం ఉన్న సింగరేణి ఆసుపత్రులు కేవలం మెడికల్ బోర్డుల నిర్వహణకే పరిమితమవుతున్నాయా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
సొంత వైద్య వ్యవస్థను బలోపేతం చేయలేరా?
ఏడాదికి దాదాపు రూ.90 కోట్లు కార్పొరేట్ వైద్యానికి వెచ్చిస్తున్న నేపథ్యంలో, ఇదే మొత్తాన్ని సింగరేణి సొంత ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు, సూపర్ స్పెషాలిటీ సేవల ఏర్పాటుకు వినియోగిస్తే పరిస్థితి ఎలా ఉండేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చవుతున్న నేపథ్యంలో రిఫరల్ విధానం, కార్పొరేట్ ఆసుపత్రులతో ఒప్పందాలు, బిల్లుల చెల్లింపులు, ఒక్కో కేసుకు అయిన వ్యయం తదితర అంశాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలన్న డిమాండ్ పెరుగుతోంది. కార్పొరేట్ ఆసుపత్రులతో సింగరేణి సంస్థ చేసుకున్న ఒప్పందాలు, రిఫరల్ విధానం, వైద్య ఖర్చులు, బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.






