విషాహారం ముప్పు
భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆకలి తీరుస్తున్న మన దేశానికి అన్నపూర్ణ అనే పేరుంది. హరిత విప్లవంతో ధాన్యం గింజల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకున్న భారతదేశం సేంద్రియ వ్యవసాయంలోనూ ఎంతో ఖ్యాతి గడించింది. అలాంటి దేశంలో నేడు రసాయనమయమైన పంటలు పండటం శోచనీయం. మన దేశంలో పండే కూరగాయలు, పండ్లు, ధాన్యం గింజల్లో పరిమితికి మించి రసాయన అవశేషాలు వెలుగుచూడటం ఆందోళనకరం.
మనం నిత్యం విషాహారాన్ని భుజిస్తున్నామని స్వయంగా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం గమనార్హం. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సేకరించిన 70 వేలకు పైగా పంట నమూనాల్లో 3.1 శాతం నమూనాల్లో మోతాదుకు మించి రసాయనాలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. తెలంగాణ పరిస్థితి మరింత దయనీయంగా ఉండటం కలవరపెడుతున్నది. రాష్ట్రంలో సేకరించిన 8 వేలకు పైగా నమూనాల్లో 486 నమూనాలు, అంటే సుమారు 6 శాతం రసాయనాలమయం కావడం సాధారణ విషయమేమీ కాదు.
కాగా, పంటలను చీడపీడల నుంచి కాపాడుకోవాలనే ఉద్దేశంతో రైతులు మోతాదుకు మించి రసాయనాలను వినియోగిస్తుండటం ఈ అతి వాడకానికి ఒక కారణంగా కనిపిస్తున్నది. మరోవైపు రసాయన కంపెనీలు అధిక లాభాల కోసం అవసరానికి మించి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో అన్నదాతలకు సరైన అవగాహన లేకపోవడం, శాస్త్రీయ సూచనలు అందకపోవడం, ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నది.
అయితే, మన దేశంలో పండిన పంటల్లో మోతాదుకు మించి రసాయన అవశేషాలు ఉండటంపై విదేశాల్లోనూ అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. మన పంట ఎగుమతులను చైనా, జపాన్ వంటి దేశాలు తిరస్కరించిన దాఖలాలు లేకపోలేదు. విదేశాల్లో మన పంటల నాణ్యత, రసాయన అవశేషాలపై ప్రశ్నలు తలెత్తుతున్నా, మన దేశంలో మాత్రం కనీస చర్చ జరగకపోవడం దురదృష్టకరం. అయితే, ఈ విషాహారం ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదు. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ రసాయన జాఢ్యం అమాయకులను బలిగొంటున్న నేపథ్యంలో సురక్షితమైన వ్యవసాయ విధానాల వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇప్పటికైనా గుర్తించాలి.






