15-11-2025 01:46:39 AM
బీహార్ ఎన్నికల ఫలితాలు మహాఘఠ్బంధన్‌ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈసారైన గెలుద్దామని అనుకున్న ఆర్జేడీ కూటమి కల కలగానే మిగిలిపోయింది. ముఖ్యంగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌కు ఘోర పరాభవం కలిగింది. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలంగా శ్రమిస్తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. 1990 నుంచి 2005 వరకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో బీహార్ ప్రజలు వణికిపోయారని, ఆయన పాలనను జంగిల్‌రాజ్‌గా ప్రత్యర్థులు పోలుస్తారు.
శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడం, దాడులు, వర్గపోరు, హత్యలు, కిడ్నాప్‌లు, హింసాత్మక ఘటనలతో బీహార్ అట్టుడికింది. ఈ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పదే పదే ప్రస్తావించి లబ్ధిపొందారు. 1997లో ఓ విచారణ సందర్భంగా పాట్నా హైకోర్టు రాష్ట్రంలో పరిస్థితులను ఆటవిక రాజ్యంతో పోలుస్తూ జంగిల్‌రాజ్ అనే పదాన్ని ఉపయోగించింది. అప్పటి నుంచి లాలూ తెరవెనుక ఉన్నా ఆయన కుటుంబ సభ్యులను కూడా ప్రజలు పూర్తి స్థాయిలో నేటికీ విశ్వసించడం లేదు.
ఫలితమివ్వని హామీలు
ఆర్జేడీ కూటమి రోజుకో హామీ చొప్పున ప్రకటించినా విశ్వసించలేదు. ఆర్జేడీ కూటమి తన మ్యానిఫెస్టోలో 25హామీలు ప్రకటించింది. వీటిలో ముఖ్యంగా ఉపాధి, మహిళా సంక్షేమం, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేకించి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో ప్రతి కుటుంబానికి కనీసం ఒక వ్యక్తికి సర్కారీ ఉద్యోగం కల్పించే చట్టాన్ని తీసుకొస్తామనేది వారి ప్రధాన హామీగా నిలిచింది.
దీంతో పాటు, ‘మాయి బెహెన్ మాన్ యోజన’ కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 చొప్పున (సంవత్సరానికి రూ. 30,000) ఆర్థిక సాయం అందించే హామీ ఇచ్చారు. అలాగే, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, ఉద్యోగుల పాత పింఛన్ పథకం పునరుద్ధరణ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ’జీవికా దీదీ’లకు ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వత హోదా ఇవ్వడం వంటివి ముఖ్యమైన హామీలలో ఉన్నాయి.
ఆరోగ్య పరంగా, జన స్వాస్థ్య సురక్షా యోజన కింద ప్రతి వ్యక్తికి రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని కూడా చెప్పారు. సామాజిక న్యాయం కోసం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ 20% నుంచి 30%కి, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ 16% నుండి 20%కి పెంచుతామని, అలాగే అన్ని పంటలను కనీస మద్దతు ధర కు కొనుగోలు చేయడానికి ఏపీఎంసీ చట్టాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నా చివరకు ప్రజలు ఆర్జేడీ కూటమిని తిరస్కరించారు.
కేసుల ఇబ్బంది..
ఆర్జేడీ గత పాలన నుంచి వచ్చిన జంగల్‌రాజ్ పేరుకు తోడు.. తేజస్వీపై పలు కేసులు ఉండడం కూడా ఎన్నికల్లో ప్రతికూలంగా మా రాయి. ఆయనపై 11 కేసులు ఉండడంతో పాటు ఐఆర్‌సీటీసీ హోటల్ స్కాం, ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ లో కూడా ఆయన పేరు తెరపైకి వచ్చింది.
ఆర్జేడీ నేత శక్తిమాలిక్ హ త్య కేసులో కూడా తేజస్వీ యాదవ్ ఆరోపణలు రావడం, దీనికి తోడు తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ జేజేడీ పేరుతో పెట్టిన కొత్త పార్టీ కూడా ఓట్లు చీల్చి ఆర్జేడీ కూటమికి ఓ కారణమయ్యాడు.