calender_icon.png 2 November, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరావతి నగర్ వద్ద రోడ్డు మరమ్మతు పనులు పూర్తి

01-11-2025 07:44:46 PM

వేగంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులు

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ 100 ఫీట్ల రోడ్డులోని అమరావతినగర్ వద్ద వరద ధాటి కారణంగా ప్రధాన రహదారి దెబ్బతినగా మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయడంతో  శనివారం సాయంత్రం వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం ఉదయం రోడ్ల పరిస్థితిని పరిశీలించి ఆర్ అండ్ బి శాఖ అధికారులను వెంటనే మరమ్మత్తు పనులు మొదలు పెట్టాలని ఆదేశించగా రోడ్ల మరమ్మత్తు పనులు మొదలయ్యాయి. ప్రధాన రహదారి కావడంతో వరద తాకిడికి దెబ్బతిన్న ఈ రోడ్డు మరమ్మతు పనులను ఆర్ అండ్ బి శాఖ అధికారులు మెటల్, డస్ట్ తో సాయంత్రం వరకు మరమ్మతు చేయించారు. తాత్కాలిక మరమ్మత్తులు పూర్తి కావడంతో కేయూ - ఫాతిమా నగర్ వైపు వాహనాల రాకపోకలు మొదలయ్యాయి.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్ అండ్ బి ఈఈ  సురేష్ బాబు పర్యవేక్షణలో ఆ శాఖ అధికారులు పనులను పూర్తి చేశారు. వరద తాకిడికి అమరావతి నగర్ వద్ద రోడ్డు దెబ్బతినడంతో  మూడు రోజులపాటు ఇటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ క్షేత్రస్థాయిలో శనివారం ఉదయం సందర్శించి రోడ్డు మరమ్మతులు సాయంత్రానికల్లా పూర్తిచేయాలని ఆదేశించడంతో ఆర్ అండ్ బి శాఖ అధికారులు రోడ్డు పనులను వేగవంతం చేసి పూర్తి చేశారు. ఆర్ అండ్ బి అధికారులు ఉదయ్, గోపికృష్ణ రోడ్డు మరమ్మత్తు పనులు సాగుతుండగా అక్కడే ఉండి పర్యవేక్షించారు. తాత్కాలికంగా పూర్తి చేసిన మరమ్మతు పనులతో మూడు రోజుల తర్వాత వాహనాల రాకపోకలు కొనసాగుతుండడంతో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు తొలగిపోయాయి.