11 July, 2026 | 1:58 AM

వేగం కాదు.. ప్రాణమే ముఖ్యం

11-07-2026 12:19 AM

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

వెంకటాపూర్, జులై 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఆదేశాల మేరకు, ములుగు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో శుక్రవారం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ టోల్ ప్లాజా వద్ద ‘అరైవ్ అలైవ్‘ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు డీఎస్పీ, సీఐ, వెంకటాపూర్ ఎస్త్స్ర పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్‌ఐ ప్రమాణాల హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్బెల్ట్ ఉపయోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగాన్ని నివారించాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదని తెలిపారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు.

పాదచారులు జీబ్రా క్రాసింగ్ను ఉపయోగించాలని, వాహనం నడిపే ముందు బ్రేకులు, లైట్లు తదితర భద్రతా పరికరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను పోలీసులు శాలువాతో సన్మానించి అభినందించారు. వేగం కాదు.. ప్రాణమే ముఖ్యం, సురక్షితంగా వెళ్లండి, సురక్షితంగా చేరుకోండి అనే సందేశాన్ని ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, టోల్ ప్లాజా సిబ్బంది మరియు పలువురు వాహనదారులు పాల్గొన్నారు.