7 April, 2026 | 2:21 AM

రాదారుల్లో మృత్యువు!

07-04-2026 12:00 AM

దేశంలో రహదారులు రక్తమోడుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై రక్తపుటేరులు పారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలతో పటిష్ఠ చర్యలు చేపడుతున్నా లక్షల మంది మృత్యువాత పడుతుండటం బాధాకరం. అయితే, నిరుడితో పోలిస్తే జాతీయ రహదారులపై ప్రమాదాలు, మరణాల సంఖ్య కొంతమేరకు తగ్గడం ముదావహం. రోజుకు సుమారు 485 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుండటం కలచివేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024లో జాతీయ రహదారులపై 1,50,958 ప్రమాదాలు జరగగా; 64,772 మంది మరణించారు. అయితే, 2025లో జాతీయ రహదారులపై 1,34,307 ప్రమాదాలు జరగగా, 57,482 మంది మరణించినట్టు కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి.

నిరుడితో పోలిస్తే మరణాల సంఖ్య 11 శాతం తగ్గినట్టు కేంద్రం స్పష్టం చేస్తున్నది. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్టు క్షేత్రస్థాయి అనుభవాలు తెలియజేస్తున్నాయి. రహదారుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్ ప్రమాదాలు, మరణాల్లో మాత్రం ప్రథమ స్థానంలో ఉండటం శోచనీయం. మరణాల్లో రెండో మన తర్వాతి స్థానంలో ఉన్న చైనాలో భారత్‌లో ఏటా నమోదవుతున్న మరణాల్లో 36 శాతమే సంభవిస్తున్నాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో ఉన్న అమెరికాలో భారత మరణాల్లో 25 శాతమే నమోదవుతున్నాయి.

మన దేశంలో మొత్తం 63.45 లక్షల కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా, ఇందులో జాతీయ రహదారులు 1.46 లక్షల కిలోమీటర్లు కాగా, 1.80 లక్షల కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రహదారుల్లో జాతీయ రహదారుల వాటా 2.3 శాతమే. కానీ, ప్రమదాల్లో మాత్రం వీటి వాటా 36 శాతం కావడం కఠిన వాస్తవం. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారిలో 66 శాతం మంది 18 ఏండ్లలోపువారే. రహదారుల నిర్మాణాల్లో లోపాలు, రహదారి భద్రత పట్ల సరైన అవగాహన లేకపోవడం, అతివేగం లాంటి కారణాలు భారత యువత భవిష్యత్తును చిదిమేస్తున్నది.

ఈ ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్రవాహనదారులే మరణిస్తున్నారు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే 2025లో 6,973 మరణాలతో జాతీయ రహదారులపై అత్యధిక మరణాలు సంభవిస్తున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో స్వల్పంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గినట్టు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ గణాంకాలు చెప్తున్నాయి. అదే సమయంలో గుజరాత్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో వీటి సంఖ్య కొంతమేరకు పెరిగినట్టు తెలుస్తున్నది.

ఇక మన రాష్ట్రంలో 2025లో జాతీయ రహదారులపై 8,395 ప్రమాదాలు జరగగా, సుమారు 2,652 మంది మరణించారు. నిరుడితో పోలిస్తే ప్రమాదాలు, మరణాల సంఖ్య కొంతమేరకు తగ్గినట్టు నివేదికలు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ఇంకా మరణాలు నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్టు కేంద్రప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 16,542 బ్లాక్‌స్పాట్లను గుర్తించి తాత్కాలిక చర్యలు చేపట్టినట్టు, వీటిలో తెలంగాణలోనూ 1535 బ్లాక్‌స్పాట్‌లు ఉన్నట్టు తెలియజేసింది. అయితే, తాత్కాలికంగా పనులు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా, శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని మరణాల తీవ్రత నొక్కిచెప్తున్నది.