7 April, 2026 | 2:18 AM

ఆరోగ్యమే అభివృద్ధి

07-04-2026 12:00 AM

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకొనే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మన జీవితాల్లో ఆరోగ్య ప్రాధాన్యతను గుర్తుచేసే ఒక ముఖ్యమైన సందర్భం. 1948లో డబ్ల్యూహెచ్‌వో స్థాపన సందర్భంగా ఈ రోజును అధికారికంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా గుర్తించారు. ఆరోగ్యం అనేది వ్యక్తిగత అంశం మాత్రమే కాదు, అది ---సమాజం, దేశం, యావత్ ప్రపంచం అభివృద్ధికి పునాది అనే సందేశాన్ని ఇది ఇస్తుంది. ఆరోగ్యాన్ని సాధారణంగా మనం వ్యాధులు లేకపోవడంగా మాత్రమే భావిస్తాం.

కానీ, డబ్ల్యూహెచ్‌వో నిర్వచనం ప్రకారం ఆరోగ్యమంటే శారీరక, మానసిక, సామాజిక సౌఖ్యం కలిగి ఉండటం. ఈ విస్తృత దక్పథం మన ఆరోగ్య విధానాలను, జీవనశైలిని మారుస్తుంది. అయితే వాస్తవంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇంకా ప్రాథమిక ఆరోగ్య సేవలకు దూరంగా ఉన్నారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య రంగం ఒక కీలక సవాలు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత, డాక్టర్ల లేమి, అవగాహన లోపం ---ఇవన్నీ కలిసి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తారు. ఈ థీమ్‌లు సమకాలీన సమస్యలను ప్రతిబింబిస్తాయి---. ఇటీవల కొవిడ్ మహమ్మారి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థల బలహీనతలను బయటపెట్టింది. అదే సమయంలో ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెంచాల్సిన అవసరాన్ని స్పష్టంగా నొక్కిచెప్పింది. ఈ నేపథ్యంలో భారతదేశం ఆరోగ్య రంగంలో కొన్ని కీలక చర్యలు తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు పేదలకు వైద్య భద్రతను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా ఆరోగ్య సేవలను సాంకేతికతతో అనుసంధానించేందుకు కృషి జరుగుతోంది. అయినప్పటికీ, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఆరోగ్య రంగంలో పురోగతి కనిపిస్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అనేక ప్రధాన సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడం, జీవనశైలిలో మార్పులు రావడం, ప్రభుత్వ భాగస్వామ్యం బలోపేతం కావడం చాలా అవసరం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంటే ఒక రోజు మాత్రమే కాదు-. --ఇది ఒక ఉద్యమం కావాలి.

వ్యక్తిగత స్థాయిలో మనం ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతతపై దృష్టిపెట్టాలి. సమాజ స్థాయిలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, శుభ్రత, పర్యావరణ పరిరక్షణ లాంటి కీలక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ స్థాయిలో సమాన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని చెప్పక తప్పదు. ఆరోగ్యాన్ని కేవలం వ్యక్తిగత బాధ్యతగా కాకుండా, సామాజిక బాధ్యతగా కూడా చూడాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజు మనకు గుర్తుచేసే విషయం ఒక్కటే--- జీవితం ఎంతో విలువైనది, ఆరోగ్యం ఎంతో అమూల్యమైనది. కాబట్టి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.

- ఎల్లబోయిన వెంకటేశ్వర్లు 

81849 40814

సీనియర్ జర్నలిస్ట్