6 April, 2026 | 4:54 AM

గుండె ముక్కలైన ‘అంటరాని ప్రేమ’

06-04-2026 02:09 AM

కలేకూరి ప్రసాద్ అలియాస్ యువక.. అలియాస్ సంఘమిత్ర.. ఈ పేర్లు కేవలం ఒకరి నామధేయాలు కాదు, అవి నిప్పుకణికలు. దళిత సమాజం నుంచి ఉద్భవించి, ఆ వర్గాల ఆత్మగౌరవ పతాకాన్ని గగనమంత ఎత్తుకు ఎగురవేసిన మహాకవి కలేకూరి. జీవితంలో తాను అనుభవించిన అంటరానితనం, అవమానాలు, వెలివేతలపై గళమెత్తిన ధిక్కార కవి. తన మనసుకు తగిలిన ప్రతి గాయాన్ని అక్షర శరంగా మార్చి, వ్యవస్థపై సంధించిన కలం యోధుడు. ఇదే కోవలో కలేకూరి రాసిన కవితలను గుదిగుచ్చి ‘ప్రేమలేఖ’ ప్రచురణ సంస్థ తీసుకువచ్చిన సంకలనం ‘అంటరాని ప్రేమ’. దళిత, బహుజన సాహిత్య పరంపరలో ఈ సంకలనం ఒక సంచలనం.

అణచివేతకు గురైన గుండెల ప్రతిధ్వనులు పుస్తకంలోని కవితలు. కలేకూరి కవితల స్థాయి అంచనా వేయాలంటే ముందు ఆయన పుట్టుక, బాల్యంతోపాటు అప్పటి స్థలకాలాలను బేరీజు వేయాల్సి ఉంటుంది. కలేకూరి 1964 అక్టోబర్ 25న ఇప్పటి ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచెర్లలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లలితా సరోజిని, శ్రీనివాసరావు ఉపాధ్యాయులు. విద్యావంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ, చుట్టూ ఉన్న సామాజిక వివక్ష ఆయన్ను కలవరపెట్టింది. స్వయంగా ఆయన అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. ఆ వేధింపులు కలేకూరిని కుదురుగా నిలవనీయలేదు. అలా తన హృదయం రగులుతున్న క్రమంలోనే కంచికచెర్లలో కోటేశు అనే దళిత యువకుడిని పెత్తందార్లు సజీవ దహనం చేశారు. ఈ ఘటన కలేకూరిని తీవ్రంగా కలచివేసింది. 

భావాల్లో తీవ్రమైన గాఢత

కంచికచెర్ల కోటేశు సజీవ దహనం తర్వాత కాలేకూరి అడుగులు విప్లవ పథం వైపు నడిచాయి. సమాజంలో వేళ్లూనుకున్న అసమానతలను రూపుమాపాలనే తపనతో ఆయన నాటి పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరారు. అక్కడ రాజకీయ పాఠశాలల్లో బోధకుడిగా కొనసాగారు. తద్వారా విప్లవ భావజాలాన్ని విస్తరించారు. విప్లవోద్యమంలో తాను క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, అక్కడ కూడా ఆధిపత్యకులాలకు చెందిన వారి పెత్తనం నడవడాన్ని కలేకూరి జీర్ణించుకోలేకపోయారు. ‘కులం ఎందుకు?’ అనే ప్రశ్నకు అగ్రనేతల నుంచి తనకు సరైన సమాధానం దొరకలేదని  ఆయన భావించారు. ఆ క్రమంలోనే నక్సలిజం నుంచి బయటకు వచ్చి, దళిత ఉద్యమాల్లో భాగస్వామి అయ్యారు.

ముఖ్యంగా కారంచేడు మారణకాండ తర్వాత కలేకూరిలోని దళిత చైతన్యం ఉప్పొంగింది. ఆ దారుణాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఒగ్గుకథగా మలిచి, ఊరూరా పాడుతూ దళిత జాతిని మేల్కొల్పారు. ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా.. విరిసీ విరియని ఓ చిరునవ్వా’, ‘భూమికి పచ్చాని రంగేసినట్లు అమ్మలాలో’ అంటూ ఆయన పాడిన పాటలు ఒక సంచలనం. తర్వాత ఇవే పాటలు ‘శ్రీరాములయ్య’ చిత్రం ద్వారా జన బాహుళ్యం పొందాయి. ఈ క్రమంలోనే కలేకూరి అచ్చమైన అంబేద్కరిస్టుగా మారిపోయారు. అంబేద్కర్ భావజాలం వైపు మళ్లి నాటి దళిత ఉద్యమ నేతలు కత్తి పద్మారావు, (శివసాగర్), ప్రజా యుద్ధనౌక గద్దర్ వంటి వారితో కలిసి దళిత బహుజన ఉద్యమాలను బలోపేతం చేశారు.

దళిత కవిగా ఎది గారు. కలేకూరి కవిత్వంలో పదునైన రాజకీయ స్పృహతో పాటు ఆర్ద్రతతో కూడిన మానవత్వం కనిపిస్తుంది. ఆయన రాసిన ’అంటరాని ప్రేమ’ కవితా సంకలనం అట్టడుగు వర్గాల జీవన వ్యధను, వారి ఆశలను కళ్లకు కడుతుంది. కవితలలో ప్రేమ కేవలం వ్యక్తిగత భావోద్వేగం కాదు, అది కుల వ్యవస్థ గోడలను బద్దలు కొట్టాలని చూసే ఒక ధిక్కారం. ఆధిపత్య కులాల చేతిలో దళితులు ఎదుర్కొంటున్న వివక్ష గురించి, ఆయన రాసిన పంక్తులను చదువుతుంటే సరాసరి గుండెలో పిడిబాకు గుచ్చి, తిరిగి అంతేవేగంగా వెనక్కి లాగినట్టు ఉంటుంది.‘చచ్చిన శవాలను తగలబెట్టడం తెలుసు నాకు/ కానీ, బతికుండగానే మీ వాళ్ళు నాకు నిప్పుపెట్టారు’ అంటూ కవి సామాజిక క్రూరత్వాన్ని ఎంగట్టారు ఒక కవితలో. శరీరాలను కిరసనాయిలు మంటలు కాలుస్తున్నా, గుండెల్లో రగిలే ప్రేమ తాలూకు నిప్పుల కుంపటి బాధే ఎక్కువని చెప్పడం కలేకూరి కవిత్వంలోని గాఢతకు నిదర్శనం.

కుల వ్యవస్థపై నిరసన

‘జాలిపడాల్సిన జాతి’ అనే శీర్షికన ఖలీల్ జిబ్రాన్ కవితను కలేకూరి ప్రసాద్ అనువదించిన తీరు అద్భుతం. సమాజంలోని నైతిక పతనాన్ని ఈ కవిత ఎండగడుతుంది. మంత్రగాళ్లు తత్వవేత్తలుగా చలామణి అవుతున్నారని, గుంటనక్కల వంటి వారు నాయకులుగా వెలుగొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అనుకరణనే కళగా భావించే జాతిని చూసి జాలిపడమని ఆయన పిలుపునిచ్చారు. పశుబలంతో విర్రవీగే వాడిని రాజుగా కీర్తించే మనస్త త్వాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు.

‘ముఖచిత్రం’ కవితలో అంబేద్కర్‌ను కలేకూరి ఒక ప్రపంచ ఉదయభానుడిగా అభివర్ణించారు. ధ్వంస రచనలకు కూలిపోయే విగ్రహం కాదని, కర్పూరంలా కాలిపోయే రాజ్యాంగ పత్రం అంతకన్నా కాదని ఆయన స్పష్టం చేశారు. ‘దేహం’ కవిత స్త్రీ శరీరాన్ని చూసే పురుష సమాజ దృక్పథాన్ని ప్రశ్నిస్తుంది. ‘నీకేం కావాలి?‘ అని ప్రశ్నిస్తూ మొదలయ్యే కవిత స్త్రీ శరీరాన్ని కేవలం మాంసంలాగానో, కొవ్వులాగానో చూసే సంకుచితత్వాన్ని ఎండగడుతుంది. ఆమె శరీరం ఒక పురాతనమైన అగ్నిజ్వాల అని, అందులోని సారాన్ని పీల్చుకోవాలనుకునే వారి ధోరణిని తప్పుబట్టారు.

స్త్రీలోని ప్రేమను, ప్రతిభను గుర్తించకుండా కేవలం భౌతికమైన ఆకర్షణలకే పరిమితమయ్యే మనస్తత్వంపై ఈ కవిత ఒక నిశితమైన విమర్శను సంధిస్తుంది. మంత్రగత్తె, మంత్రదండం వంటి ప్రతీకలను వాడుతూ స్త్రీ అస్తిత్వాన్ని, ఆమె శక్తిని ఈ కవితలో విశ్లేషించారు. ‘ఒలికిపోయిన పాట’ కవితలో కాలం కేవలం సాక్షిగా మిగిలిపోతుందని చెబుతూ, జీవితంలోని నిరాశను, మృత్యువు ఛాయలను కవి చిత్రించారు. నీలి నక్షత్రాలు చీకట్లో వణుకుతున్నాయని, ఆకాశంలో ప్రవహించే చీకటి కెరటాలు జీవనాదాన్ని కబళిస్తున్నాయని కలేకూరి వర్ణించారు.

సమాజం యొక్క వికృత ముఖం మీద ఉమ్మివేస్తూ, అంటనంత దూరంలో ఘనీభవించిన గోదావరిలా మారిపోయిన ’పాట’ గురించి ఆయన ఆవేదన చెందారు. డేవిడ్ డియోప్ రాసిన ‘ఆఫ్రికా! నా ఆఫ్రికా!’ కవితను కలేకూరి తెలుగులోకి అద్భుతంగా మలిచారు. తరతరాల అణచివేతకు గురైన ఆఫ్రికా ఖండాన్ని ఒక యోధురాలిగా చిత్రించారు. సుదూర నదీతీరాల్లో బామ్మ పాడే పాటల్లో ప్రతిధ్వనించే ఆఫ్రికా వీరత్వాన్ని స్మరించారు. పంట పొలాల్లో చిందిన ఆఫ్రికా నెత్తురు బానిసత్వానికి చిహ్నం కాదని, అది విముక్తి కోసం సాగే పోరాట శక్తి అని చాటి చెప్పారు.

అక్షరమే ఆయుధంగా

కలేకూరి ప్రసాద్ కేవలం కవి మాత్రమే కాదు, గొప్ప అనువాదకుడు కూడా. ఇంగ్లిష్‌పై ఉన్న పట్టుతో ఆయన విదేశీ సాహిత్యాన్ని తెలుగులోకి అద్భుతంగా తర్జుమా చేశారు. స్వామి ధర్మతీర్థ రాసిన ‘హిందూ సామ్రాజ్యవాద చరిత్ర’ను ఆయన చేసిన అనువాదం ఇప్పుడొక ఒక కరదీపిక. మహాశ్వేతా దేవి, అరుంధతీరాయ్ వంటి వారి రచనలను కూడా తెలుగులోకి తెచ్చి, ప్రపంచ స్థాయి సామాజిక విశ్లేషణలను సామాన్య పాఠకులకు చేరువచేశారు. కలేకూరి జీవితం ఒక నిరంతర ప్రవాహం. కొందరికి ఆయన మాటలు షాక్ కలిగిస్తే, మరికొందరికి అవి వెలుగునిచ్చే కిరణాలుగా మారాయి. జీవితకాలం కలేకూరి అస్తిత్వ ఉద్యమాల కోసమే పనిచేశారు. చివరి రోజుల్లో ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, ఆయన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ సమాజ హితం కోసమే పరితపించేవి. కలేకూరి ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన రచనలు తరతరాలకూ స్ఫూర్తి. 

నేను జన సమూహాల గాయాన్ని

గాయాల సమూహాన్ని

తరతరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రుణ్ణి

అవమానాలకూ, అత్యాచారాలకూ

మానభంగాలకూ, చిత్రహింసలకు గురై

పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తినవాణ్ణి

ధనమదాంధ కులోన్మత్తుల రాజ్యంలో

బతకడమే ఒక నిరసనగా బతుకుతున్నవాణ్ణి

బతికేందుకు పదే పదే చస్తున్నవాణ్ణి

నన్ను బాధితుడని పిలువకండి

నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి

నేను అమరుణ్ణి !

 ప్రసాద్