28 July, 2026 | 2:01 AM

అడుగుకో గుంత.. తీరేనా చింత..!

28-07-2026 01:10 AM

అధ్వానంగా మారిన రోడ్లు

భారీ గుంతలతో నరకయాతన

పట్టించుకోని అధికారులు 

మేడ్చల్, జూలై 27 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో రహదారులు పూర్తిగా అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లమీద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. చిన్నపాటి వర్షాలకి రోడ్లమీద గుంతలు ఏర్పడ్డాయి. రోడ్లు అధ్వానంగా తయారైనప్పటికీ సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదు.

ఆర్ అండ్ బి శాఖలో నిధుల కొరత ఉంది. నిధుల కొరత వల్ల కనీసం ప్యాచ్ వర్క్ లు కూడా చేపట్టడం లేదు. జిల్లాలో 384.08 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్లు ఉన్నాయి. నిధులు లేనందున నిర్వహణ కూడా సరిగా చేయడం లేదు. గుంతలు ఏర్పడమేగాక రోడ్ల పక్కన చెట్లు పెరిగి రోడ్ల మీదకు వచ్చాయి. ఈ చెట్లను కూడా తొలగించడం లేదు. నిత్యం రద్దీగా ఉండే గండి మైసమ్మ, మేడ్చల్, షామీర్‌పేట్, మూడు చింతలపల్లి, కీసర రోడ్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. 

ఈ రోడ్లపై ప్రయాణం నరకమే.. 

మేడ్చల్ పట్టణంలోని చెక్ పోస్టు నుంచి కిష్టాపూర్, గండి మైసమ్మ రోడ్లు నరకప్రాయంగా తయారయ్యాయి. ఈ రెండు రోడ్లమీద వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. మేడ్చల్ నుంచి గండి మైసమ్మ వరకు రింగురోడ్డు సర్వీస్ రోడ్డు లేదు. దీంతో ఈ రోడ్డు మీద వాహనాలు భారీ సంఖ్యలో వెళుతుంటాయి. రోడ్డు ఎరుకుగా ఉండటం వల్ల ఇబ్బందికరంగా తయారైంది. భారీ వాహనాలే కాకుండా కార్లు, ఆటోలు, ఇతర చిన్న వాహనాలు పెద్ద సంఖ్యలో వెళుతుంటాయి.

కూకట్పల్లి, మియాపూర్, హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలు ఈ రోడ్డు గుండా నే వెళ్తుంటాయి. మేడ్చల్ చెక్పోస్ట్ నుంచి కిష్టాపూర్ మధ్యలో భారీ గుంతలు ఏర్పడ్డా యి. లైట్ మోటార్ వాహనాలు ఈ గుంతలలో వెళ్లలేకపోతున్నాయి. ఈ రోడ్డుమీద గుంతలు ఎప్పుడు ఉంటాయి. సంబంధిత అధికారులు కనీసం గుంతలను కూడా పూడ్చలేకపోతున్నారు. ఈ రహదారిపై పరిశ్రమలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ట్రాఫిక్ పోలీసులు పరిశ్రమల సహకారంతో ఒకచోట సిమెంట్ వేయించారు. ఈసారి రెండు మూడు చోట్ల భారీ గుంతలు ఏర్పడ్డా యి. ఒకవైపు భారీ వాహనాలు, మరోవైపు గుంతలతో లైట్ మోటార్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు బాగుంటే మేడ్చల్ పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్‌కు ఉపయోగపడుతుంది.

హ్యమ్ రోడ్లకు మోక్షమెప్పుడో..? 

జిల్లాలో పలు రోడ్లకు హ్యమ్ పథకం కింద నిధులు మంజూరయ్యాయి. కానీ ప నులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. గండి మైసమ్మ, చెక్ పోస్ట్, మేడ్చల్, షామీర్పేట్, మూడు చింతలపల్లి, కీసర రోడ్లకు 66 కిలోమీటర్లకు రూ. 167 కోట్లు మంజూరయ్యా యి. రోడ్ల నిర్మాణం జరిగితే వాహనదారులకు సౌకర్యంగా ఉంటుంది. చెక్‌పోస్ట్ నుంచి కిష్టాపూర్ రోడ్డుకు తాత్కాలికంగా గుంతలు పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.