ఒక్క ఏడాదిలో 100 రోబోటిక్ సర్జరీలు
మెడికవర్ ఆస్పత్రి వైద్యుల ఘనత
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ జనరల్, లాపరోస్కోపిక్, బేరియాట్రిక్ అండ్ మినిమల్లి ఇన్వేసివ్ సర్జన్ డా. శరత్ చంద్ర కౌశిక్ (ఎఫ్‌ఏఎల్‌ఎస్, ఎఫ్‌ఐఎస్‌సీపీ) ఏడాదిలో 100 రోబోటిక్ -అసిస్టెడ్ జనరల్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ 100 శస్త్రచికిత్సల్లో 35 ఇంగ్వైనల్ హెర్నియా రిపేర్లు, 25 గాల్బ్లాడర్ సర్జరీలు, 20 సంక్లిష్ట అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్లు, 10 బేరియాట్రిక్ సర్జరీలు, 10 గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రక్రియలు ఉన్నాయి.
వీటిలో దాదాపు సగం కేసులు సంక్లిష్టమైనవేనని ఆసుపత్రి తెలిపింది. మొత్తం 100 కేసుల్లో 96 శస్త్రచికిత్సలు పూర్తిగా రోబోటిక్ విధానంలో జరిగాయి. మూడు కేసులను లాపరోస్కోపిక్ విధానానికి, ఒక కేసును ఓపెన్ సర్జరీకి మార్చారు. రోగి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు డా. శరత్ చంద్ర కౌశిక్ తెలిపారు. రోబోటిక్ సర్జరీ వల్ల అనుకూలమైన రోగుల్లో చిన్న కోతలు, శస్త్రచికిత్స అనంతర నొప్పి తగ్గడం, త్వరగా కోలుకోవడం వంటి ప్రయోజనాలు లభించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి అనస్థీషియాలజిస్టులు, రోబోటిక్ ఆపరేషన్ థియేటర్ నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, సర్జికల్ అసిస్టెంట్లు, టెక్నీషియన్ల సమిష్టి కృషి కారణమని తెలిపారు.






