9 August, 2026 | 1:48 AM

న్యూరో ట్రామాలో గోల్డెన్ అవర్ కీలకం

09-08-2026 12:45 AM

కిమ్స్ ఆస్పత్రి డాక్టర్ భాస్కర్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు, తలకు గాయాలు, వెన్నెముక దెబ్బలు వంటి న్యూరో ట్రామా కేసుల్లో ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంటలో సరైన చికిత్స అందించడం అత్యంత కీలకమని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. భాస్కర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో న్యూరోట్రామా సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, కిమ్స్ న్యూరోసర్జరీ విభాగం సహకారంతో నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ న్యూరో ట్రామా నర్సింగ్ సదస్సును ఆయన ప్రారంభించారు.

కిమ్స్ న్యూరోసర్జరీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డా. మానస్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీలు దేశంలో ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారుతున్నాయని తెలిపారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్చడం, అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడం, హెల్మెట్ వినియోగాన్ని పెంచడం ద్వారా మరణాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. మూడు రోజుల సదస్సులో అత్యవసర న్యూరో సేవలు, గోల్డెన్ అవర్ చికిత్స, మెదడు వాపు పర్యవేక్షణ, న్యూరో ఐసీయూ సంరక్షణ, వెన్నెముక గాయాలు, పిల్లలువృద్ధుల్లో న్యూరో ట్రామా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, పునరావాసం తదితర అంశాలపై నిపుణులు చర్చిస్తున్నారు.

కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పున్ సర్జన్ డా. రాఘవేంద్ర, కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ న్యూరో సర్జన్ డా. శ్వేత, న్యూరోట్రామా సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. సుమిత్ సిన్హా, దేశవ్యాప్తంగా న్యూరోసర్జన్లు, న్యూరోక్రిటికల్ కేర్ నిపుణులు, నర్సింగ్ విద్యావేత్తలు, ట్రామా నిపుణులు సదస్సుకు హాజరయ్యారు.