26 July, 2026 | 1:48 AM

గొర్రెగండిలో రాతి చిత్రాలు

26-07-2026 12:00 AM

10 వేల సంవత్సరాల నాటివిగా పరిశోధకుల అంచనా 

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నెవానిపల్లెలోని గొర్రెగండి మైసమ్మ గుట్టలో వెలుగులోకి వచ్చిన ప్రాచీన రాతి చిత్రాలు చరిత్ర పరిశోధకులను విస్మయానికి గురిచేస్తున్నాయి. దాదాపు 10 వేల సంవత్సరాల నాటివిగా భావిస్తున్న ఈ రాతి చిత్రాల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, టాస్మానియా ప్రాంతాల్లో మాత్ర మే కనిపించే కంగారూ, ఎకిడ్నా వంటి జంతువుల బొమ్మలు ఉండటం విశేషం.

గ్రామస్తుల సహకారంతో గుట్టపైకి వెళ్లి పరిశీలించిన పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి బృందం, ఇవి ప్రాచీన మానవుడి జీవన విధానం, సంచార చరిత్ర, కళా నైపుణ్యానికి అరుదైన ఆనవాళ్లని పేర్కొంది. పసిఫిక్, హిందూ మహాసముద్రాల సరిహద్దుల్లోని టాస్మానియా, ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉన్న న్యూగినియా ప్రాంతాల్లో కనిపించే జంతువుల చిత్రాలు తెలంగాణలో లభించడం తొలుత నమ్మశక్యంగా అనిపించలేదని రత్నాకర్‌రెడ్డి తెలిపారు. అయితే చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రాచీన మానవుడి మేధస్సు, సుదూర ప్రాంతాల సంచారంపై కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయని చెప్పారు. 

ప్రధాన ఆకర్షణగా కంగారూ చిత్రం

గుహలో లేత ఎరుపు రంగుతో ఉన్న కంగారూ రాతి శిల్పం ప్రధా న ఆకర్షణగా నిలుస్తోంది. ఎరుపు రంగు, పొడవైన దేహం కలిగి మేత మేస్తున్న భంగిమలో ఉన్న ఈ చిత్రంలో ఒక కన్ను, చెవి, పొడవైన తోక స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం జీవించే కంగారులకు భిన్నంగా వెనుక కాళ్లు వ్యతిరేక దిశలో చిత్రీకరించి ఉండటం విశేషం.

ఆస్ట్రేలియా భూభాగం నుంచి దక్కన్ పీఠభూమికి వచ్చిన ప్రాచీన మానవులు తమ జ్ఞాపకాల ఆధారంగా ఈ చిత్రాన్ని గీసి ఉండవచ్చని, లేదా ఈ చిత్రాన్ని గీసినప్పుడు కాళ్లు వ్యతిరేక దిశలో ఉండవచ్చని, ఒకప్పుడు ఈ ప్రాంతంలోనూ కంగారూ జాతి సంచరించి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా గుహ పైకప్పుపై ప్రస్తుతం ఆస్ట్రేలియా, టాస్మానియాలో మాత్రమే కనిపించే ఎకిడ్నా చిత్రంతో పాటు, ఖడ్గమృగాన్ని పోలిన జంతువు, తాబేలు, బల్లి, పాము, నక్షత్రాలు, వత్తం చుట్టూ వడు పంగల కర్రల ను పోలిన చిత్రాలను కూడా గుర్తించారు.

ఇవి కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియా, టాస్మానియాలోనే కనిపిస్తాయి. గుట్టపై లభించిన రాతి పనిముట్లు, రాపిడి గుర్తులు, హెమటైట్ ఖనిజ రాళ్ల ఆధారంగా ఈ చిత్రా లు మధ్య శిలాయుగం ప్రారంభం నుంచి నవీన శిలాయుగం వరకు గీసినవిగా భావిస్తున్నారు. తొలి దశ చిత్రాలు క్రీ.పూ. 10 వేల సంవత్సరాల నాటివి కావచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

చిత్రాలకు ఎదురుగా ఉన్న శిల ఉపరితలంపై లోతైన గ్రూవ్స్ (రాపిడి గుర్తు లు) ఉన్నాయి. ఇవి రాతి పనిముట్లను నూరుకునే పరిశ్రమను గుర్తు చేస్తున్నాయి. గుహ ముందు హెమటైట్ ఇనుప ఖనిజం రంగు రాళ్లు లభించాయి.ఈ రాళ్లను పొడి చేసి,జంతువుల కొవ్వు లేదా మొక్కల జిగురుతో కలిపి అప్పట్లో రంగులు తయారు చేసేవారని తెలుస్తుంది.

 పెద్దగారి దేవరాజు

(ముస్తాబాద్, విజయక్రాంతి)

భవిష్యత్ తరాలకు అందించాలి

మా చిన్నతనంలో మేకలు, పశువులను మేపడానికి తాతలు, నాన్నలతో ఈ గుట్టకు వెళ్లేవాళ్లం. రాళ్లపై ఉన్న చిత్రాలను చూశాం. కానీ వాటి గురించి మాకు తెలిసేది కాదు. కాల క్రమే ణా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ చిత్రాల గురించి తెలుస్తుంది. గుట్టపై ఉన్న రాతి చిత్రాలకు ఇంత చరిత్ర ఉందని తెలిసింది.

ప్రభుత్వం, పురావస్తు శాఖ వారు ఈ రాతి చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ రాత్రి చిత్రాలు మా ఊరి గుట్టపై బయటపడడం,పదివేల సంవత్సరాలు వెనక్కి వెళినట్లు గా మా మనస్సుకు అనిపిస్తుంది. అదృష్టంగా భావిస్తున్నాం. 

 కరికే మహేష్, కరికే బాబు, గన్నెవానిపల్లి