26 July, 2026 | 2:15 AM

సాతవాహనుల కులమేమిటి?

26-07-2026 12:00 AM

కోటిలింగాల సమీపంలోని మొక్కట్రావ్‌పేటలో లభించిన హకుసిరి శాసనం ‘అహమక’తో ప్రారంభమవుతున్నది. ‘అహమక’ అంటే ‘అస్మక’నే. ఇది తెలంగాణానే అస్మక జానపదమనడానికి తిరుగు లేని శాసససాక్ష్యం. ఇంత వరకు ఏ జానపదం గురించైనా పురాణాల్లో రాసి వుందనే విన్నాం. కాని, ‘అస్మక’ శాసన బద్ధం అయిన మహా జన పదం. అస్మక తెలంగాణా లోనిదే. సాతవాహనులు అస్మకులే. ఇది సాతవాహనుల చరిత్రలో కొత్త సన్నివేశం. లిఖిత చరిత్రలో విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా శ్రీకాకుళం నుంచి సిముక సాతవాహనుడు మొదట పాలించాడని తొలి తరం పరిశోధకులలో కొందరి మతం. తర్వాత గుంటూరు జిల్లా ధరణికోట, మహారాష్ట్రలోని పైఠాన్‌లను రాజధానులుగా పాలించారన్న వాదనలు మిగిలాయి. నాసిక్, పూనా ప్రాంతంలో వెలుగుచూసిన శాసనాలు పాలకులు సాతవాహనులనే అన్నాయి కానీ, ఆంధ్రులు అనలేదు.

మహారాష్ట్ర చరిత్ర పరిశోధకులు సాతవాహనుల జన్మభూమి తమ రాష్ట్రంలోనే వుందని గౌతమీ పు త్ర సాతకర్ణి సాతవాహన సామ్రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించాడని అభిప్రా యం కలిగివున్నారు. గోపాలచారి అనే చరిత్ర పరిశోధకుడు సాతవాహనులు మొదట పశ్చిమ దక్కను నుంచి పాలించారే తప్ప తీరాంధ్ర దేశం వారి ఏలుబడిలో లేదని చెప్పాడు. తెలంగాణాలోని జగిత్యాల జిల్లా కోటిలింగాలలో పురావస్తుశాఖ తవ్వకాలలో బయటపడిన ఆధారాలు ఈ విషయాన్ని రుజువు చేసాయి.

కృష్ణా, గోదావరి నదుల నడిమి ప్రాంతమే కాకుండా ఇప్పటి తెలంగాణా భూభాగం కలిసిన రాజ్యభాగాన్ని కూడా ఆనాడు ఆంధ్రదేశంగా పేర్కొన్న విషయాన్ని గణించాలి. ‘ఆంధ్రశ్చ బహవః’, అనేకులైన ఆంధ్రులలో తెలంగాణా నుంచి పాలన ప్రారంభించిన సాతవాహనులు ఒక శాఖ కావచ్చు.

హైద్రాబాదు మ్యూజియంలో 38,512 సాతవాహన నాణాలు, మద్రాస్ మ్యూజియంలోని 6,000ల సాతవాహన నాణాలను అధ్యయనం చేసి, సాతవాహనుల పాలన తెలంగాణాలోనే ప్రారంభమైందని మారేమండ రామారావు అభిప్రాయ పడ్డాడు. ఆంధ్రుల జాతియొక్క నాయకులలో ఒకడైన సాతవాహనుడు ముందుకువచ్చి, నేటి హైదరాబాద్ ప్రాంతాన్ని స్వాధీనపరచుకొని, దానిని ఒక రాజ్యంగా ఏర్పరచుకుని స్వతంత్రుడుగా పరిపాలించాడు.

ఇతని సంతతివా రు 30మంది ఇతని పేరునే తమవంశనామంగా పెట్టుకొని, ఈ రాజ్యాన్ని, ఒక మహా సామ్రాజ్యంగా విస్తరించి, దీనిని నాలుగున్నర శతాబ్దుల కాలం పరిపాలించారు. సాతవాహనుని అనంతరం అతని కుమారుడు సిముకుడు రాజ్యానికి వచ్చాడు. మారేమండ రామారావు ఆంధ్ర దేశ చరిత్ర, పే.6 (నవంబరు, 1959) 

కోస్తాంధ్రలో గౌతమీపుత్ర సాతకర్ణి, ఆ తర్వాత సాతవాహన పాలకుల నాణాలు దొరికాయని రాప్సన్ (1908) నివేదిక. సాతవాహనుల కడపటి రాజధాని అమరావతి (ధాన్యకటకం). అశోకుని శాసనంలో రతిక, పిటినిక, భోజక, ఆంధ్ర, పుళిందుల ప్రసక్తి వుంది.

వీరిలో రథికులు మహా రాష్ట్రంలో, పిటినికులు పైఠానులో, భోజకులు విదర్భలో, పుళిందులు వింధ్య పర్వతాలకు దక్షిణాన వుంటారని చరిత్రకారుల నిర్ణయం. గోదావరి నదికి దక్షిణంగావున్న మధ్య, తూర్పు భాగాలలో మిగిలిన వారు కళింగులతో చేరి వున్న ఆంధ్రులు (మెగస్తనీసు). అందువల్ల దక్షిణా పథంలోని తూర్పుభాగం వీరిదే.

ఆంధ్ర భృత్యులు

పురాణాలు కణ్వులు పాలకులుగా వున్నపుడు వారి ఆధిపత్యంలో ఆంధ్రులున్నారని, వారినే ఆంధ్రభృత్యులని పేర్కొంటున్నాయి. సాతవాహనులు ఆంధ్ర భృత్యులు కారని చెప్పాడు అజయ మిత్ర శాస్త్రి. తమ శాసనాలలో ఎక్కడ కూడా తమను ఆంధ్ర భృత్యులమని  సాతవాహనులు చెప్పుకోలేదు. పురాణాలు ఆంధ్రుల పాలనలో వారి సామంతులు ఆంధ్ర భృత్యులుగా పేరు పొందుతారని పేర్కొన్నా యి. భవిష్య, విష్ణుపు రాణాలు అభీరులను ఆంధ్ర భృత్యులుగా ప్రస్తావిస్తున్నాయి.

కోటి లింగాల తవ్వకాలు 

పిటి. శ్రీనివాస్ అయ్యంగార్ సాతవాహనులు అస్మక ము లక ప్రాంతం వారంటే, మారేమండ రామారావు సాతవాహనులు తెలంగాణా నుంచే పాలించారన్నాడు. కోటి లింగాల తవ్వకాల్లో బయట పడిన నాణాల ఆధారంగా కోటిలింగాల్లో సాతవాహనుల కంటె ముందు పాలించిన స్వతంత్ర పాలకులు ‘గోబద, నరన, కంవాయస, సిరి కంవాయస, సిరికామ, సమగోప’ అనే 6గురి తర్వాత చిముకుడు సాతవా హన రాజ్యాన్ని స్థాపించివుంటాడని పీవీ పరబ్రహ్మశాస్త్రి, డీ రాజారెడ్డి, ఠాకూర్ రాజారాం సింగ్, వీవీ కృష్ణశాస్త్రి, బీఎన్ శాస్త్రి వంటి చారిత్రక పరిశోధకులు అంగీకరించారు. సాతవాహనులమీద సాధికారిక పరిశోధనలు చేసిన వాడు అజయ మిత్ర శాస్త్రి. (సిరికామ పేరును తెలియ జేసింది, నాణాన్ని సేకరించింది నాణకవేత్త కందుల వేంకటేశ్ గారు)

మహారాష్ట్రలో బౌద్ధభిక్షువుల ఆలయాలు

మహారాష్ట్రలోని పర్వతాలలో సాతవాహనులు తొలిపించిన బౌద్ధభిక్షువుల విహారాలు, ఆలయాలే దొరికాయి. సాతవాహనులు నిర్మించిన నగరాలు, కట్టడాలు లేవు. సాతవాహనులు కట్టించిన నగరాల శిథిలాలు తెలంగాణాలోని మెదకు, నల్లగొండ, మహబూబునగర్, నల్లగొండ, కరీంనగర్, హైద్రాబాద్, ఆదిలాబాద్ (పాత జిల్లాలు) ల్లో  అనేక ప్రదేశాల్లో అగుపిస్తాయి. మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్రనగరాలు నిశ్చయంగా తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్ ల్లోనే వున్నాయి.

తొలి సాతవాహనుల నాణాలు తెలంగాణా లోనే మొదట లభించాయి. సాతవాహనుల మొదటి నివాస స్థానం తెలంగాణాలోనే అని ఖచ్చితంగా చెప్ప వచ్చు. కాణ్వ సుశర్మను ఓడించిన ఛిముకుడు పాటలీ పుత్రమో, విదిశనో రాజధాని చేసుకోకుండా పైఠాన్ ను ఎందుకు రాజధానిగా చేసుకున్నాడు? ఇది సత్యం కాదు. ఛిముకుడు కోటి లింగాలను పాలిస్తున్నపుడే సుశర్మను ఓడించాడన్నది సరైన చరిత్ర.

సాతవాహనుడి వంశం!

క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందిన సోమదేవుడు రాసిన ‘కథాసరిత్సాగరం’లో సంతానం లేని దీపకర్ణి అనే రాజు వేటకు వెళ్ళినపుడు సింహంపై బాలుడు కనిపించడాన్ని చూసి, బాణంతో సింహాన్ని వధించాడు. సింహరూపం నుంచి విమోచనం పొందిన  ఒక యక్షుడు, తనపేరు సాతుడని చెప్పి, బాలున్ని అప్పగించి వెళ్ళిపోయాడు. దీపకర్ణి ఆ బాలు న్ని తనతో తెచ్చుకుని, పెంచుకుని తన వారసుని చేసుకున్నాడు.

‘సాత’ (యక్షుని) వాహనంగా లభించిన వాడు కనుక అతనికి సాతవాహనుడనే పేరు పెట్టాడు. అతడే సాతవాహన వంశానికి మూల పురుషుడని పిలువ బడ్డాడు. బాణుడు హర్ష చరితంలో, రాజ శేఖరుడు కావ్య మీమాంసలో, సోమ దేవుడు కథా సరిత్సాగరంలో, హేమచంద్రుని అభిదాన చింతా మణిలో, వాత్సాయనుని కామ శాస్త్రంలో సాతవాహన శబ్దాన్నే వాడారు.

డీడీ కోసం బి, పీబీ దేశాయ్ లు ‘సప్తి’ అన్న పదం గుర్రం అన్న అర్థంలో ‘సాత’ అయిందని, సప్తివాహనుడని సూర్యు ణ్ణి అంటారని, సాతవాహనుడంటే గుర్రం వాహనంగా కలవాడని  అభిప్రాయ పడ్డారు. సాతవాహనులు అశ్వక జాతివారని, వాయవ్య భారతదేశంలోని అశ్వకులే అసమకులని (అస్మకులని) అన్నవారున్నారు. 

సాతవాహనుల వర్ణం, కులం

సిముకసాతవాహనుని సోదరుడు కన్హుడు సాదవాహన కులం వాడని నాసిక్ శాసనంలో..

‘సాదవాహనకు(లే) కన్హే రాజాని నాసికకేన

సమణేన మహామాతేణ లేణా కారిత’ అని,

వాసిష్టీపుత్ర పులుమావి నాసిక్ శాససంలో 

‘సాతవాహనకుల యసపతిథాపన కరస’ (సాతవాహనకుల యశప్రతిష్టాపకుడు) గౌతమీ పుత్ర సాతకర్ణి సాతవాహ న కులం వాడని తెలుస్తున్నది. వాసిష్టీపుత్ర పులుమావి నాసి క్ శాసనంలో ‘ఏకబ్రాహ్మ ణ’ (ఏక బమ్మణస) అని ఉండడం వల్ల సాతవాహనులది బ్రాహ్మణ కులమని కె.పి.జయస్వాల్, ప్రొ.హెచ్.పి. రాయచౌధురి, జోగీంద్రచంద్రఘోష్, ప్రొ. ఓరుగంటి రామచంద్ర య్య, బిఎన్.శాస్త్రి అన్నారు.

ద్వాత్రింశత్ పుత్తళిక (సింహాసన ద్వాత్రింశిక) అనే గ్రంథంలో సాతవాహనులు బ్రాహ్మణులు అని ఉన్నదనడం, ఒక కట్టుకథల పుట్ట అయిన గ్రంథాన్ని ఆధారంగా నిర్ణయానికి రావడం సరైంది కాదు. గౌతమీపుత్ర సాతకర్ణికి ‘ఖతియదఫమాన మదన’ అంటే క్షత్రియ దర్పమాన మర్దనుడని బిరుదు. పరశురాముని లెక్క క్షత్రియ సంహారం చేసినవాడనా? కాడు. నాసిక్ శాసనంలో గౌతమీ పుత్ర సాతకర్ణి తల్లి గౌతమీ బాలశ్రీ గురిం చి ‘రాజరిసి వధు సదమఖిల మనువిధియ మానాయ’ (రాజర్షి వధూ శబ్దమఖిల మను విదధిత్వా) అని వుంది.

గౌతమీ బాలశ్రీ భర్త, గౌత మీ పుత్ర సాతకర్ణి తండ్రి రాజర్షి అని తెలుస్తున్నది. రాజర్షి శబ్ధంతో సాతవాహనుల క్షత్రియులనే ఆలో చన కలుగుతుం ది. సాతవాహనుల కులం క్షత్రియకులమని అన్నది ప్రొ.డి. ఆర్ భండార్కర్ అభిప్రాయం. గౌతమీపుత్ర సాతకర్ణికి ‘రామకేసవాజున భీమసేన తుల పరకమస’, ‘నాభాగ నహుస జనమేజయ సకర యయాతి రామాంబరీ సతేజస’ (రామకేశవార్జున భీమసేన తుల్య పరాక్రమస్య, నాభాగ నహుష జనమేజయ సగర యయాతి రామాంబరీష సమతేజస్య) అనే ప్రశస్తి వుంది.

దీనితో సాతవాహనులు క్షత్రియులనడానికి అవకాశం వుంది. కాని, బ్రాహ్మణులకు క్షత్రియులతోడి సాదృశ్యమెందుకు?సాతవాహనులు బ్రాహ్మణులైతే ద్రోణాశ్వత్థామ పరశురాములతో పోలిక చెప్పాలి కదా. సాతవాహనులు బ్రాహ్మణులు కారేమో...

భాగవతంలో, భవిష్యోత్తర పురాణంలో సిముకుడు వృషలుడని ‘సింహకస్వాతికర్ణాఖ్య సిముకో వృషలో బలి’ అని వుంది. వృషలుడంటే శూద్రుడు. ఈ శబ్దం కులవాచకం. అమరం ‘శూద్రాశ్చావర వర్ణాశ్చ వృషలాశ్చ జఘన్యజైః’ అం టుంది. శూద్రులు రాజులవడానికి ఉదాహరణ మౌర్య చంద్రగుప్తుడే. అయితే శూద్రులకు యజ్ఞాధికారం ఉందా? 

మహాభారతంలో  ‘యతోహి సర్వవర్ణానాం 

యజ్ఞస్తస్తువ భారత

అగ్రే సర్వుషు యజ్ఞేషు శ్రద్ధా యజ్ఞోనిధీ తే’ 

(మహాభారతం, శాంతిపర్వం, అధ్యాయం-60, శ్లోకం 40) వేదకాలంలోనే పైజవనుడు యజ్ఞం చేసినట్లు వ్యాసప్రోక్తం.

‘శూద్రః పైజవనోనామ సహస్రాణాం శతందదౌ

ఐన్ద్రాగ్న్యేన బహుదానంచ దదౌ’ ఇష్టవాన్ అంటే యజ్ఞం చేసివాడని, వేదకాలంలో వర్ణభేదం లేదని చరిత్రకారుల అభిప్రాయం.

వర్ణ భేదం ఒక్క ‘పురుష సూక్తం’లోనే పేర్కొన బడ్డది.(రుగ్వేదం-10-90), శుక్ల యజుర్వేద వాజసనేయ సంహిత, దాని ఆరణ్యకం, అధర్వ వేదాల్లో పురుష సూక్తం కొంత మార్పు తో కనబడు తున్నది. పురుష సూక్తం రుగ్వేదంలో ప్రక్షిప్తం అని పరిశోధకుల నిశ్చితాభిప్రాయం. వీరేశలింగం పంతులు ‘వేద యుగంబున వృత్తిని బట్టి, జన్మమును బట్టి వర్ణ వ్యవస్థ లేదనడమే నిశ్చితం’ అన్నాడు.

సాతవాహనుల తర్వాత మహా యజ్ఞాలు చేసిన శూద్రులు సముద్ర గుప్తుడు, ప్రోలయ వేమా రెడ్డి. శూద్రస్త్రీ నాగానిక దీర్ఘ వ్రత యజ్ఞ దీక్షి త అవడం, శూద్రుడైన సాతకర్ణి యాగాలు చేయడం నిరాఘాటంగా జరిగాయి. పురాణాలను బట్టి సూర్య, చంద్ర వంశ సంబంధం, సూత్ర, గోత్ర సంపర్కం లేని సాతవాహనులు శూద్రులవడం వాస్తవం. సాతవాహన పదానికి 100 ఏనుగులు కాక గుర్రాలు కల వారని అర్థం. ముండా భాష లో సద అంటే గుర్రం.

కోన్ అంటే కొడుకు. గుర్రం కొడుకని కథ చెప్పవచ్చు. సాతవాహన శబ్దం పురాణాల్లో లేదు. వ్యవహారంలో లేదు. శాలివాహన శబ్దమైతే కొన్ని సంస్కృతాంధ్ర గ్రంథాలలో వుంది. సాతవాహనుల శాసనాలలో ‘సాదవాహన, సాతవాహన’ పదాలున్నాయి. సాదవాహన, సాతవాహన పదాలు  మహారాష్ట్ర ప్రాకృత భాష నుంచి వచ్చినయనవచ్చు.సాత, సాద, సాతు శబ్దాలకు ఏడు, ధాన్యవిశేషం అని, వాహనమంటే ప్రవహించేది, విత్తనాలు చల్లడమని అర్థాలున్నాయి. సాతవాహన అంటే ధాన్యం పండించే వారని చెప్పొ చ్చు. 

‘శాలివాహన వంశేచ రాజానో దశచా భవన్

రాజ్యం పఞ్చాశతాబ్దంచ కృత్వా లోకాన్తరం యయుః’ 

అని భవిష్యత్పురాణం. శ్రీనాథుడు శాలివాహన శబ్ద ప్రయోగం చేసాడు. సంస్కృతంలో సాత శబ్దానికి ‘బాల తృణ విశేషమ’ని, ఇదే ప్రాకృతంలో సాద, సాత, సాతు అవుతుంది. శాద పదానికి శాద్వల శబ్దానికి అర్థ విపరిణా మం సహజం. వహ ధాతువుకు ఉత్పత్తి చేయు అని అర్థం. శాలి అంటే ధాన్యం. వహనమంటే ఉత్పత్తి చేయడం. శాలివాహన అంటే ధాన్యోత్పత్తి చేయు వాడని అర్థం.

అంటే సామాన్యార్థం ధాన్యం పండించే వారు, రైతులు అని అర్థం. కర్షకులు శూద్రులు. సాతవాహనులు శూద్రులు. పెద్ద బొంకూరులో దొరికిన టెర్రకోట ముద్ర మీద నాగలి, నాగలికి కట్టిన కాడి, కాడికి రెండువైపుల రెండ్రెండు కనా లు (ఎద్దులకు మెడపట్టీలు పెట్టి బిగించే కర్రలు) వున్నా యి. ఈ ముద్ర నాగరిక ముద్ర. పెదబంకూర్ సాతవాహ న నగరం. పెదబంకూర్ పాలకుని పేరు కూడా ఈ ముద్ర తో పాటు దొరికింది.

సాతవాహనులా, సాతకర్ణులా?

తొలుత సాతవాహనులుగానే పిలువబడిన ఈ రాజులు మొదటి సాతకర్ణి పిదప తమ పేర్ల చివర సాతకర్ణి ధరించడం చర్చించదగిన విషయమే. నానేఘాట్ శాసనంలో ‘రాయసిముక సాతవాహనో సిరిమతో దేవి నాయనికాయరణో చ సిరిసాతకనినో, కుమారో సాతవాహనో’ అని రాయబడిన విధంగా వీరి పేర్ల చివర సాతవాహన వుంటుంది. సాతవాహన వారి వంశ నామంగా స్థిరపడింది. కన్హేరీశాసనంలో చిముకుని తమ్ముడు కన్హుడు సాతవాహన కులంవాడనడం వంశ వాచకమే.

మేకదొని శాసనంలో రాణో సాతవాహణాం సిరిపులుమావిస అనడం కూడా వారిది సాతవాహన వంశమని పేర్కొనడమే. నానేఘాట్ శాసనంలోనే నాయనికాదేవి భర్త పేరు సిరిసాతకర్ణి (సిరిసాతకనినో) అని పేర్కొనబడింది. తర్వాత సాతవాహన రాజులందరి పేర్ల చివర సాతకర్ణి చేరింది.

సాతకర్ణి వారసులుగా చెప్పుకోవటానికి సాతవాహన బదులుగా సాతకర్ణి వారి పేర్ల చివర చేర్చ బడిందా, నానేఘాట్ శాసనంలో నాయనికా రాయించిన విధంగా సాతకర్ణి నామాన్నే స్వీకరించారా? కన్హేరీ శాసనం ‘వాసి ష్టీ పుత్రస్య సాతకర్ణిస్య’ అంటుంది. రుద్రదాముని గిర్నార్ శాసనంలో ‘దక్షిణాపథపతే శ్శాతకర్ణే ద్విరపి’ అని పేర్కొంటున్నది.

సాంచి శాసనం ‘సిరి సాతకనిస’, అమరావతి శాసనం ‘సిరి సివమక సద సాతకర్ణి’,  నాసిక్ శాసనం ‘రణో గోతమీ పుతస సామి సిరియన సాతకనిస’, నాగార్జునకొండశాసనం ‘రణో గోతమి పుతస సిరివిజయ సాతకనిస’...అని పేర్కొనడం సాతకర్ణి అనే పిలుపు వారసత్వంగా నిలిచి పోయింది అనడానికి సాక్ష్యాలు.

శ్రీరామోజు హరగోపాల్,

కన్వీనర్, కొత్త తెలంగాణ

చరిత్రబృందం

99494 98698