calender_icon.png 6 December, 2024 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భువనగిరి గడ్డ మీద గులాబీ జెండే

04-05-2024 02:26:15 AM

ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా.. ప్రభుత్వం పడిపోదు

బీజేపీకి ఓటేస్తే పెనం మీది నుంచి పొయ్యిలోకే  

అయిదు నెలల్లోనే రేవంత్ పాలన రివర్స్ గేర్ 

మాజీ మంత్రి హరీశ్‌రావు 

మునుగోడు, మే 3 : భువనగరి గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీలో రోడ్ షోలో  మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి బీఆర్‌ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌తో కలిసి పాల్గొన్నా రు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిందని, నేటికీ ఆరింట్లో ఒక్కటి కూడా అమలుపరచలేదని విమర్శించారు.

మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలను మహా మోసం చేశారని, రైతులకు రూ.15 వేల రైతుబంధు అందజేస్తామని చెప్పి ఎకరాకు పదివేలు కూడా పూర్తిగా అందించలేదని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతులకు రైతుబంధుని అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. భూము లు, ఆస్తులు కాపాడుకోవడానికి ఇసుక కంకర దొంగతనాలు చేయడానికి పార్టీలు మారవచ్చు.. కానీ నిజమైన ఉద్యమకారులు, కార్యక ర్తలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో విర్రవీగుతూ రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టాలి అన్నారని గుర్తుచేశారు.

వీళ్ల అహంకారం దింపాలంటే క్యామ మల్లేశ్‌ను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయి నా.. ప్రభుత్వం పడిపోదని చెప్పారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ వెంకన్న, రవీంద్ర , రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.