calender_icon.png 25 December, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్‌డ్రైవ్ గేమ్‌చేంజర్

25-12-2025 02:45:29 AM

  1. ఫోన్‌ట్యాపింగ్ కేసులో అనూహ్య మలుపు
  2. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు పెన్‌డ్రైవ్‌లో సంచలనాలు
  3. హైకోర్టు జడ్జీలు, జర్నలిస్టులు, రాజకీయ నేతల ప్రొఫైల్స్ లభ్యం
  4. ఇవే కీలక సాక్ష్యం..

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ విచారణ, అరెస్టుల చుట్టూ తిరిగిన ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు ఒక పెన్‌డ్రైవ్ కేంద్రంగా మారింది. అందులో నిక్షిప్తమైన సమాచారం బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు వద్ద లభించిన ఈ పెన్‌డ్రైవ్‌లో ట్యాపింగ్‌కు సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్నాయని సిట్ భావిస్తోంది. ఈ సాక్ష్యాల ఆధారంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.

పెన్ డ్రైవ్‌లో ఏముంది?

ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు అత్యంత రహస్యంగా సేకరించిన సమాచారాన్ని ఈ పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచినట్లు సిట్ గుర్తించింది. ఇందులో ఉన్న వివరాలు చూసి అధికారులే విస్తుపోతున్నారు. కేవలం ఫోన్ నంబర్లు మాత్రమే కాకుండా.. హైకోర్టు జడ్జీలు, ప్రముఖ జర్నలిస్టులు, కీలక రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల పూర్తి ప్రొఫైల్స్ ఇందులో ఉన్నట్లు సమాచారం. వందల సంఖ్యలో ట్యాప్ చేసిన ఫోన్ నంబర్లు, వారి వ్యక్తిగత సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉంది.

ప్రస్తుతం సిట్ కస్టడీలో ఉన్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును ఈ పెన్‌డ్రైవ్ ఆధారంగానే అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఎల్లుండి వరకు ఆయన్ను విచారించనున్న నేపథ్యంలో.. ఈ పెన్‌డ్రైవ్‌లోని డేటాను ఎవరి ఆదేశాల మేరకు సేకరించారు.?  ఎవరికి చేరవేశారు.? అన్న కోణంలో లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను , మరో మాజీ ఎస్‌ఐబీ చీఫ్‌ను విచారించిన సిట్.. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారంతో కేసుకు ముగింపు పలికే దిశగా వెళ్తోంది.

అసలు ఈ ట్యాపింగ్ పర్వం ఎవరి ప్రయోజనాల కోసం జరిగింది.? అన్నదే ఇప్పుడు సిట్ ముందున్న ప్రధాన ప్రశ్న. ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాలు లేనిదే ఇంతటి భారీ నిఘా యంత్రాంగం నడవడం అసాధ్యమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. 

సర్వత్రా తీవ్ర ఉత్కంఠ

పెన్‌డ్రైవ్‌లో ఉన్న సమాచారం కను క నేరుగా రాజకీయ పెద్దలకు లింక్ అయితే, వారికి నోటీసులు ఇవ్వడం ఖాయమని పోలీసు వర్గాల టాక్. ఈ పెన్ డ్రైవ్ వ్యవహారం బయటకు రావడంతో.. అందులో ఎవరెవరి పేర్లు ఉ న్నాయన్నది ఇప్పుడు రాజకీయ, మీడి యా, న్యాయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ట్యాపింగ్ కేసులో ఇన్నాళ్లూ దొరకని కీలక లింక్ ఈ పెన్ డ్రైవ్ రూపంలో దొరికిందని, ఇదే ఈ కేసులో గేమ్ ఛేంజర్ కాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని సంచలన అరెస్టులు లేదా నోటీసులు వెలువడే అవకాశం ఉంది.