పూసపల్లి ప్రాజెక్టు సాధనకు కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
ఇల్లందు టౌన్, జూన్ 18 (విజయక్రాంతి): పూసపల్లి ప్రాజెక్టు సాధన కోసం గురువారం ఇల్లందు పెన్షనర్ల భవనంలో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పూసపల్లి ప్రాజెక్టు అత్యవసరమని, ఈ ప్రాజెక్టు అమలుకాకపోతే ఇల్లందు పట్టణం అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని సమావేశంలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు సాధన కోసం అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మరోసారి విస్తృతస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని తీర్మానించారు.
ఈ సమావేశానికి హాజరుకాని ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాలకు హాజరైన సంఘాల తరఫున లేఖ రాసి తదుపరి సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. తదుపరి సమావేశాన్ని జూన్ 27న నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో కెంగర్ల మల్లయ్య (టీజీబీకేఎస్), జె. సీతారామయ్య (జీఎల్బీకేఎస్), కె. విశ్వనాథ్ (జీఎల్బీకేయూ), నాయిని సైదులు (బీఎంఎస్), ఎస్.కే. యాకుబ్ షావలి (టీయూసీఐ), బాల ప్రసాద్ (హెచ్‌ఎంఎస్)తో పాటు కొక్కు సారంగపాణి, కందగట్ల సురేందర్, కొప్పుల శ్రీనివాస్, పోశం బాబు తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.






