హత్య కేసులో రౌడీ షీటర్ కు జీవిత ఖైదు
కేసముద్రం,(విజయక్రాంతి): ప్రజల్లో భయభ్రాంతులను కల్పించి తాను రౌడీ షీటర్ గా మరింత గుర్తింపు తెచ్చుకునేందుకు అమాయకున్ని హత్య చేసిన ఘటనలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన ఆంగోత్ హరీష్ అనే రౌడీషీటర్ కు జిల్లా కోర్టు జీవిత ఖైదు, 30 వేల జరిమానా విధించింది. 2020లో అమాయకుడైన యాచకుడు, అనంతపురం జిల్లాకు చెందిన వెంకన్న అనే వ్యక్తిని రౌడీ షీటర్ హరీష్ దాడి చేసి కత్తితో గొంతు పోసి తల మొండెం వేరు చేశాడు.
ఈ సంఘటన అప్పట్లో మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, ప్రజా కంటకుడిగా వ్యవహరిస్తున్న హరీష్ కు శిక్ష పడేందుకు, తగిన సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు అతడికి జీవిత ఖైదు, 30 వేల రూపాయల జరిమానా విధించిందని, దీనివల్ల కేసముద్రం పట్టణ ప్రజలకు హరీష్ తో ఇకనుండి ఏలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని కేసముద్రం సీఐ సత్యనారాయణ తెలిపారు.




