calender_icon.png 20 January, 2026 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత నేరస్థులపై రౌడీషీట్లు నమోదు

20-01-2026 06:41:41 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా, గత నేర చరిత్రను పరిశీలించి నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మంది వ్యక్తులపై రౌడీ షీట్‌లు, సస్పెక్ట్ షీట్‌లు ఓపెన్ చేయబడినట్లు కరీంనగర్ రూరల్ సిఐ ఏ. నిరంజన్ రెడ్డి  తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే బొమ్మకల్ గ్రామానికి చెందిన ఏడేల్లి సతీష్, కల్వ సతీష్, తీగలగుట్టపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ ముస్తాక్, ఫకీర్‌పేట గ్రామానికి చెందిన  అడప వంశీ, రామగుండంకు చెందిన తుండ్ల సాయి వర్షిత్, కొండమీదీ సాయి కార్తిక్, మారుతీనగర్ కరీంనగర్ కు చెందిన ముత్తోజు సాయి తేజ అనువారు గతంలో పలు నేరాలకు పాల్పడి, ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించబడినందున  వారిపై రౌడీ షీట్‌లు, సస్పెక్ట్ షీట్‌లు ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు.

ఇకపై వారి కదలికలను కట్టుదిట్టంగా పర్యవేక్షించడంతో పాటు, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎవరికైనా నేర సంబంధిత సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోరారు. మాదక  ద్రవ్యాలు అనగా గంజాయి ఇతరత్రా మత్తుపదార్థాలు సేవించిన, అమ్మినను, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినను, స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించినను,  ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసినను ఎవరైనా దొంగ కాగితాలు సృష్టించి భూకబ్జాలు చేసినను, జూదం ఆడినను, సైబర్ నేరాలకు పాల్పడినను, మొబైల్ ఫోన్లలో చట్టవ్యతిరేకంగా ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపు లలో ఎవరివైనా నగ్న ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టినను మరియు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్టినను కఠినమైన చర్యలు తీసుకుంటామని, మరల నేరాలు చేస్తే పీడి. యాక్ట్ కేసులు నమోదు చేస్తామని అని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ.నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.