31 March, 2026 | 3:34 AM

రాయల్స్ పంజా

31-03-2026 01:02 AM
  1. చిత్తుగా ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్
  2. రాజస్థాన్ పేస్ బౌలర్ల హవా
  3. చేతులెత్తేసిన సీఎస్కే బ్యాటర్లు

ధోనీ లేని చెన్నై తేలిపోయింది. గత సీజన్ ఫ్లాప్ షోనే కొనసాగిస్తూ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్ నిరాశపరిస్తే.. మిగిలిన బ్యాటర్లు సైతం చేతులెత్తేశారు. రాయల్స్ బౌలర్ల ధాటికి సీఎస్కే ప్రధాన బ్యాటర్లెవరూ క్రీజులో నిలవలేదు. తర్వాత స్వల్ప లక్ష్యఛేదనలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ సునాయాస విజయాన్ని అందుకుని సీజన్‌లో బోణీ కొట్టింది.  

గుహావటి, మార్చి 30 : గుహావటిలో వర్షం కారణంగా చెన్నై సూపర్ కిం గ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో బౌలర్ల హవా కనిపించింది. గత రెండు మ్యాచ్‌లలో భారీస్కోర్లు నమోదవగా ఇప్పుడు బంతి ఆధిపత్యం నడిచింది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా సీఎస్కే చరిత్రలో తొలిసారిగా ధోనీ, జడేజా, రైనా ఆ ముగ్గురూ లేకుండా బరిలోకి దిగింది.

తడిచిన పిచ్ పరిస్థితులను రాజస్థాన్ పేసర్లు బాగా ఉపయోగించుకున్నారు. ఆర్చర్, బర్గర్ చెరొక ఎండ్ నుంచీ చెలరేగిపోవడంతో సీఎస్కే బ్యాటర్లు చేతులెత్తేశారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్ చెన్నై తరపున అరంగేట్రంలో నిరాశపరిచాడు. కేవలం 6 పరు గులకే వెనుదిరిగాడు. రాయల్స్ పేసర్ల ధాటికి చెన్నై ప్రధాన బ్యాటర్లెవ్వరూ క్రీజులో నిలవలేకపోయారు.

గైక్వాడ్ (6), మాథ్యూ షార్ట్ (2), సర్ఫరాజ్ ఖాన్(17), కార్తీక్ శర్మ (18) పరుగులకే వెనుదిరిగారు. వరల్డ్‌కప్‌లో అదరగొట్టి శివమ్ దూబే కూడా ఫెయిలయ్యాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 82 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. సీఎస్కే పాత ప్లేయర్ జడేజా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనుకుంటున్న దశలో జేమీ ఓవర్టన్ కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఓవర్టన్ మెరుపులు కారణం గానే చెన్నై స్కోరు 120 దాటగలిగింది. చివరికి సీఎస్కే 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 2 , బర్గర్ 2, జడేజా 2 వికెట్లు తీశారు. 128 పరుగుల లక్ష్యఛేదనలో సీఎస్కే బౌలర్లు అద్భుతా లేమీ చేయలేకపోయారు. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా వైభవ్ సూర్యవంశీ విరు చుకుపడ్డాడు.

గత సీజన్ తో ఐపీఎల్ అరంగేట్రం చేసి రెచ్చిపోయిన ఈ చిచ్చర పిడుగు ఈ మ్యాచ్ లోనూ దుమ్మురేపాడు. కేవలం 15 బంతుల్లోనే వైభవ్ సూర్యవంసీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు జైశ్వాల్ కూడా దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ పవర్ ప్లేలోనే 74 పరుగులు చేసింది. వైభవ్ 17 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేసి ఔటవగా.. జైశ్వాల్ 38 రన్స్ చేశాడు. ధృవ్ జురెల్ (18), పరాగ్ (14 నాటౌట్) రాజస్థాన్ విజయాన్ని పూర్తి చేశారు. వైభవ్ విధ్వంసంతో రాయల్స్ 12.1 ఓవర్లలోనే మ్యాచ్ ను ఫినిష్ చేసింది. 

స్కోరు బోర్డు

చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : 127 (జేమీ ఓవర్టన్ 43, కార్తీక్ శర్మ 18, సర్ఫరాజ్ ఖాన్ 17 ; ఆర్చర్ 2/19, బర్గర్ 2/26, జడేజా 2/18)

రాజస్థాన్ రాయల్స్ : 128/2 ( వైభవ్ సూర్యవంశీ 52, జైస్వాల్ 38, జురెల్ 18 ; అన్షుల్ కాంబోజ్ 2/24 )