రాష్ర్టంలో ఆర్‌ఆర్ టాక్స్!

01-05-2024 01:47:14 AM

వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లు

ఇక్కడ దోచిన సొమ్ము ఢిల్లీకి చేరవేత

నాడు బీఆర్‌ఎస్ దోచుకొంటే.. నేడు కాంగ్రెస్

ముస్లిం రిజర్వేషన్లతో ఓబీసీలకు కాంగ్రెస్ ద్రోహం

మతపరమైన రిజర్వేషన్లను ఎప్పటికీ వ్యతిరేకిస్తాం

రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు

సంగారెడ్డి, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దోపిడీ మరింత పెరిగిపోయిందని, కొత్తగా ఆర్‌ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. ఆర్‌ఆర్ అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణను పదేండ్లపాటు బీఆర్‌ఎస్ దోచుకొంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేస్తున్నదని దుయ్యబట్టారు. మంగళవారం జహీరాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలోని అల్లాదుర్గ్ చౌరస్తాలో బీజేపీ ఏర్పాటుచేసి ఎన్నికల సభలో మోదీ మాట్లాడారు. బీజేపీ వల్లనే తెలంగాణ బాగుపడుతుందని తెలిపారు. 

కాంగ్రెస్‌కు ఓట్లు మాత్రమే కావాలి

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నదని ప్రధాని మోదీ విమర్శించారు. ‘నేను బతికున్నంతవరకు భారత రాజ్యాంగాన్ని మార్చే వ్యక్తి, శక్తి రాలేదు’ అని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలనలో గతంలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసని,  బీజేపీ పదేండ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలే చేస్తుందని, ఆ పార్టీకి ప్రజల ఓట్లు మాత్రమే కావాలని ఆరోపించారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నచోట పంచ సూత్రాల పాలన చేస్తుంది. అవినీతి, కుటుంబ పాలన, అబద్ధాలు, మాఫియా, ఓటుబ్యాంకు రాజకీయాలు రాజ్యమేలుతాయి.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలువ కుంటే ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత రోజులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ‘దేశంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలంగాణలో ఆర్‌ఆర్ టాక్స్‌పై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వల్ల ప్రపంచమంతా గర్వపడితే.. ఆర్‌ఆర్ టాక్స్‌తో దేశం సిగ్గుపడేలా కాంగ్రెస్ చేస్తున్నది’ అని విమర్శించారు. తల్లిదండ్రుల ఆస్తిలో 55% పన్ను వేసి లాక్కొనేందుకు  ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. 

ప్రజల సంపద దోపిడీ

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలసి రాష్ట్రంలో ప్రజల సొమ్మును దోపిడీ చేశాయని ప్రధాని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగితే విచా రణ చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌కు వత్తాసు పలుకుతున్నదని ఆరో పించారు. బీఆర్‌ఎస్ పదేళ్లు దోపిడీ చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు కాళేశ్వరంతోపాటు ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వందరోజులో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల ఊసే లేదని, వరి పంటకు రూ.500 బోనస్ ఇంతవరకు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. 

పేదల సంక్షేమమే బీజేపీ ధ్యేయం

పేదలు, దళితులు, అదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. బేటీ బ చావో.. బేటీ పడావో కార్యక్రమంతో పాఠశాలల్లో బాలికలకు మౌలిక సదుపాయలు కల్పించామని, మహిళల సంక్షేమం కోసం ఎ న్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మహిళలను ఓటర్లుగా చూసింది తప్ప, వారి కోసం ఎలాంటి పనులు చేయలేదని ఆరోపించారు. ప్రజలందరి ఆశీర్వాదంతో అయోధ్యలో రామ మందిరం నిర్మించామని తెలిపారు. ఢిల్లీలో బలమైన సర్కార్ ఉంది కాబట్టే రామ మందిరం నిర్మాణం జరిగిందని చెప్పారు. మరింత బలమైన ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

ఎస్సీ వర్గీకరణ చేస్తాం

2004 తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు చట్ట వ్యతిరేకంగా రాత్రికి రాత్రి మతపరమైన రిజర్వేషన్లు కలిపించిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓబీసీల హక్కులను కాంగ్రెస్ కలరాసిందని ఆరోపించారు. లింగాయత్, మరాఠాలను ఓబీసీల్లో చేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని తెలిపారు. భారత రాజ్యాంగం రూపొందించేందుకు బీఆర్ అంబేద్కర్ ఎంతో కృషిచేశారని, రాజ్యాంగాన్ని తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుటికీ వ్యతిరేకమేనని స్పష్టంచేశారు. సేవాలాల్ మహరాజ్ అడుగు జాడల్లో తాము పాలన చేస్తున్నామని పేర్కొన్నారు. సంగమేశ్వర, బసవేశ్వరుల అశీర్వదంతో ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. సమావేశంతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జహీరాబాద్, మెదక్ బీజేపీ అభ్యర్థులు బీబీ పాటిల్, రఘనందన్‌రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.