19-05-2025 12:12:42 AM
-సముద్రంలో కలుస్తున్న వరద నీటి మళ్లింపు
-సీఎం, ఇరిగేషన్ శాఖ మంత్రికి మంత్రి పొంగులేటి కృతజ్ఞతలు
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): వృథాగా సముద్రంలో కలుస్తున్న మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించడానికి మున్నేరు లింక్ కెనాల్‌కు రాష్ర్ట ప్రభుత్వం రూ.162.54 కోట్లు విడుదల చేసింది.
ఇందుకు సంబంధించి జీవోను విడుదల చేసినట్లు ఆదివారం రెవెన్యూ, హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. పాలేరు లింక్ కెనాల్‌కు నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల వృథాగా పోతున్న వరద నీటిలో సుమారు 10 టీఎంసీల వరద నీటిని పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించవచ్చని తెలిపారు. దీనివల్ల ఈ రిజర్వాయర్ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు.
ఇందులో ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 1.30 లక్ష ల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు, డోర్నకల్ నియోజకవర్గం పరిధిలో పది చెరువులకు సాగునీరు ఉపయోగపడుతుందని తెలిపారు.