19-05-2025 12:12:46 AM
జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
గద్వాల, మే 18 ( విజయక్రాంతి ) : జిల్లా యంత్రాంగం రైతులకు అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఆదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. యాసంగి 2024-25 కాలానికి సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 59 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని, గత రబీ సీజన్ తో పోలిస్తే ఈసారి ధాన్యం సేకరణ 2,500 టైమ్స్ దిగుబడి పెరిగిందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ నిత్యం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, ధాన్యం సేకరణ, తరలింపును సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అకాల వర్షం వల్ల ధాన్యం తడిసినప్పటికిని రైతులు అధైర్య పడవద్దని, చివరి గింజ కొనేంత వరకు కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో డిప్యూటీ తహశీల్దార్లు, ఏ పీ ఎం లు అప్రమత్తంగా ఉన్నారని, కర్ణాటక సరిహద్దులలో గల కేటి దొడ్డి, మైలార్ గడ్డ, నందిన్నె గ్రామాల వద్ద గల కొనుగోలు కేంద్రాలలో ఉన్న ప్రతి ధాన్యం కుప్పను క్షుణ్ణంగా పరిశీలించిన పిదపనే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కర్ణాటక సరిహద్దుల గుండా జిల్లాలో అక్రమంగా ధాన్యం ప్రవేశించకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.