రూ.30 లక్షలు డిమాండ్.. ఇద్దరి అరెస్ట్
వేములవాడ, ఆగస్టు 10, (విజయ క్రాంతి): వ్యాపారులను బెదిరించి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన ఇద్దరిని వేములవాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గితే వివరాలు వెల్లడించారు.కొనరావుపేట మండలం ఏగలాస్పూర్కు చెందిన దండు వినోద్ (33), వేములవాడ నాంపల్లికి చెందిన పెద్దిగారి అమరగొండ అజయ్ (27) కలిసి స్టోన్ క్రషర్, రైస్మిల్ నిర్వాహకులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.
అగ్రహారం శివారులో క్రషర్ నిర్వహిస్తున్న నీలం గురవయ్యను బెదిరించి రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. భయపడిన బాధితుడు రూ.50 వేల నగదు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరో రైస్మిల్ నిర్వాహకుడు బండ మల్లేశం వద్ద రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపారు.బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో సాయినగర్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.50 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు
ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరిస్తే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ సూచించారు. సమీప పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో పాటు 112కు ఫోన్ చేయాలని కోరారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






