03-02-2026 02:13:19 AM
కాళేశ్వరం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం నుంచి పలుగుల, మద్దులపల్లి, చండ్రుపల్లి, అన్నారం మీదుగా చెన్నూరుకు ప్రతిరోజూ మూడు ట్రిప్పుల ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని ఆయా గ్రామాల సర్పంచులు డిమాండ్ చేశారు.ఈ మేరకు వారు మంచిర్యాల జిల్లా ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీలతను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ రూట్లో బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థలకు వెళ్లేందుకు,ఉద్యోగులు విధులకు చేరుకునేందుకు,రోగులు వైద్య సేవల కోసం చెన్నూరుకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు.గ్రామాల అభివృద్ధికి రవాణా సదుపాయం అత్యంత కీలకమని, వెంటనే ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచులు పేర్కొన్నారు.
దీనిపై అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత సానుకూలంగా స్పందిస్తూ, ఈ విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సర్పంచులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలుగుల సర్పంచి విజయలక్ష్మి, మద్దులపల్లి సర్పంచి సరిత, చండ్రుపల్లి సర్పంచి గురుసింగ బాపు, అన్నారం సర్పంచి ప్రభాకర్ పాల్గొన్నారు.