గుండెపోటుకు గురై.. ఆర్టీసీ కండక్టర్ మృతి
టేకులపల్లి, మే 26,(విజయక్రాంతి): కొత్తగూడెం - ఇల్లందు జాతీయ ప్రధాన రహదారి టేకులపల్లి మండలంలోని అని శెట్టిపల్లి - బొమ్మనపల్లి గ్రామాల సమీపంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా ప్రయాణికులకు టికెట్లు జారీ చేస్తున్న ఓ ఆర్టీసీ కండక్టర్ గుండెపోటుతో బస్సులోనే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ ఊహించని ఘోర సంఘటనతో బస్సులోని ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది. పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, భద్రాచలం నుండి హనుమకొండకు బయలుదేరింది.
బస్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అనిశెట్టిపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకున్న సమయంలో, కండక్టర్ బిరిల్లి శంకర్ ఎప్పటిలాగే సీట్ల వద్దకు వెళ్తూ, ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒక్కసారిగా గుండెల్లో తీవ్రమైన నొప్పి, రావడంతో ఊపిరి ఆడక బస్సులోనే కుప్పకూలిపోయారు. కండక్టర్ శంకర్ హఠాత్తుగా కిందపడిపోవడాన్ని గమనించిన ప్రయాణికులు, డ్రైవర్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు నిలిపివేయగా, అప్రమత్తమైన ప్రయాణికులు తక్షణమే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.
అనంతరం శంకర్ను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో ఆయనను పరీక్షించిన వైద్యులు తీవ్రమైన గుండెపోటు (మాసివ్ హార్ట్ ఎటాక్) కారణంగా శంకర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తాము ప్రయాణిస్తున్న బస్సులో కళ్లముందే టికెట్లు ఇచ్చిన కండక్టర్ నిమిషాల వ్యవధిలో శవంగా మారడంతో ప్రయాణికులు కన్నీటి పర్యంతమయ్యారు. విధి నిర్వహణలో ఉండగానే తోటి ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడంతో పరకాల డిపోతో పాటు ఆర్టీసీ సిబ్బందిలో తీవ్ర విషాదం నెలకొంది. శంకర్ అకాల మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.






