ఆర్టీసీ డ్రైవర్ వ్యాఖ్యల కలకలం
- పెట్రో ధరలపై నిరసన తెలుపుతున్న మంత్రికి ముందు వడ్లు కొనాలని చెప్పినందుకు వేటు?
- ఆర్టీసీ ఆర్‌ఎం నుంచి రిమూవల్ లెటర్ జారీ!
- ఏ రాజకీయ పార్టీని, ఏ నాయకుడినిగానీ విమర్శించలేదు
- రైతుల సమస్యలపైనే స్పందించా: డ్రైవర్ అశోక్
- డ్రైవర్‌ను విధుల్లోకి తీసుకోవాలని ఆర్‌ఎంకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వినతి
- డ్రైవర్ తొలగింపు వార్తలు అవాస్తవం: మంత్రి పొన్నం
కరీంనగర్/జగిత్యాల, మే 26 (విజయక్రాంతి): కేంద్రం పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లకు ముందు రాష్ట్రంలో ధాన్యం కొనండి అని కోరినందుకు ఆర్టీసీ డ్రైవర్‌పై వేటు పడింది. ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం నుంచి అతడికి రిమూవల్ లెటర్ జారీ చేసి, డ్యూటీకి రావద్దని సూచించినట్లు తెలిసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సోమవారం జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు.

అయితే అదే సమయంలో అదే రోడ్డుపై వెళ్తున్న జగిత్యాల ఆర్టీసీ బస్సు డ్రైవర్ బైరి అశోక్ దీనిపై స్పందించారు. ముందు వడ్లు కొనాలని, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆందోళనలు తర్వాత చేయవచ్చని మంత్రితో అన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డ్రైవర్‌పై వేటు వేసి, డ్యూటీకి రావద్దంటూ రిమూవల్ లెటర్‌ను ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జారీ చేశారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానని డ్రైవర్ అశోక్ తెలియజేశారు.
ఆర్‌ఎం నుంచి రిమూవల్ లెటర్ వచ్చిందని, డ్యూటీకి రావద్దని సూచించినట్లు వెల్లడించారు. రైతుల పక్షాన మాట్లాడినందుకే తనపై చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య నాయకుడు అధికారులపై ఒత్తిడి తెచ్చి డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
డ్రైవర్ తొలగింపు వార్తలు అవాస్తవం: మంత్రి పొన్నం
జగిత్యాలలో రైతుల పక్షాన ప్రశ్నించిన డ్రైవర్ అశోక్‌ను తొలగించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అతను కేవలం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ అని, ఆర్టీసీ ఉద్యోగి కాదు అని తెలిపారు. అయినప్పటికీ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించవ ద్దని బస్సు యాజమాన్యానికి సూచించామని చెప్పారు. అశోక్ రైతుల పక్షాన మాట్లాడినందుకు స్వాగతిస్తున్నామని పేర్కొన్నారకు. కాగా కేంద్రం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని పొన్నం అన్నారు.
ఇది ప్రజాస్వామ్యమా?: ఎంపీ రఘునందన్‌రావు
మక్కలు, ధాన్యం కొనాలన్న పాపానికి ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాన్ని తొలగించడం ప్రజాస్వామ్యమా? అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ తుగ్లక్ పాలనను రాహుల్‌గాంధీ చూడాలని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ రైతులకు బేడీలు వేస్తే, నేడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. మాట్లాడిన వారిపై ఇలాంటి అప్రజాస్వామిక, కక్షసాధింపు చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కూడా అధికా రంలో ఉండలేదని స్పష్టం చేశారు.
ప్రశ్నించే గొంతుకలపై నిరంకుశత్వం: టాస్క్
డ్రైవర్ అశోక్‌ను విధుల్లోంచి తొలగించడం, అలాగే విద్యావేత్త, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై అక్రమ కేసులు బనాయించ డం ప్రభుత్వ నిరంకుశత్వానికి అద్దం పడుతోందని తెలంగాణ అధ్యయన సమాలోచన కేం ద్రం (టాస్క్) ఆగ్రహం వ్యక్తం చేసింది. టాస్క్ అధ్యక్షుడు డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రజాస్వామ్యవాదులు, కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు.
సమాజంలో తప్పులను ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూడటం పౌర హక్కుల ను పూర్తిగా కాలరాయడమేనని వారు మండిపడ్డారు. కేవలం రైతుల పక్షాన మాత్రమే మాట్లాడానని సదరు కార్మికుడు వివరణ ఇచ్చినప్పటికీ మానవత్వం లేకుండా రిమూవల్ లెటర్ ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు.
అశోక్‌పై తీసుకున్న క్రమశిక్షణా చర్యలను ఉపసంహరించుకుని, అతనికి పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తూ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో నిరంతరం ప్రజా పక్షాన నిలుస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై అక్రమ కేసులు నమోదు చేయడం కేవలం భయభ్రాంతులకు గురిచేసే చర్యేనని ఖండించారు. అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, రైతుల నుంచి వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

డ్రైవర్‌ను విధుల్లోకి తీసుకోవాలి
వడ్ల కొనుగోలుపై ప్రశ్నించేందుకే డ్రైవర్‌పై వేటు వేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గం గుల కమలాకర్, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కమలాకర్, జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనబాట పట్టాయి.
డ్రైవర్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ ఆర్‌ఎంకు వినతిపత్రాన్ని అందించారు. ప్రజా పాలన అంటూ చెపుతున్న కాంగ్రెస్ ప్రభు త్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ దుర్మార్గమన్నారు. సస్పెన్షన్ ఎత్తివేసే వరకు అండగా ఉంటామని, అవసర మైతే అర్‌ఎం కార్యాలయం ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు.






