calender_icon.png 15 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం జాతరకు ఆర్టీసీ సిద్ధం

15-01-2026 12:21:57 AM

25 నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం

4 వేల ప్రత్యేక బస్సులు 

51 పాయింట్లు నుంచి మేడారంకు బస్సులు 

14వేల సిబ్బంది కేటాయింపు 

మేడారంలో 50 ఎకరాల భారీ బస్టాండ్ 

మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం

మేడారం, జనవరి 14 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాల నుంచి ఈనెల 25 నుండి ఆర్టీసీ ప్రత్యేక బ స్సు సర్వీసులను ప్రారంభించడానికి ఏర్పా ట్లు సిద్ధం చేస్తోంది. 2024లో జరిగిన జాతరకు 3,500 బస్సులను వినియోగించి 20 లక్షల మంది భక్తులను మేడారం జాతరకు తరలించగా, ఈసారి జాతరకు 4 వేల బస్సులను నడపనున్నట్లు, 30 లక్షల మంది భక్తులను తరలించేందుకు అనుగుణంగా ఏ ర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టిసి వరంగల్ రీజియన్ మేనేజర్ విజయ భాను తెలిపారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ 14 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు చెప్పా రు.

మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీకి ఏర్పాట్ల కోసం 4.35 కోట్ల రూపాయలను కేటాయించింది. 50 ఎకరాల్లో మేడారంలో తాత్కాలిక అతిపెద్ద బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 20 ఎకరాల్లో బస్టాండు తో పాటు మరో 20 ఎకరాల్లో బస్సుల పార్కింగ్ కోసం చదును చేశారు. జాతరకు వచ్చిన భక్తులు తెలుగు ప్రయాణంలో గమ్యస్థానాలకు చేరడానికి క్యూలైన్ల పనులను చేపట్టారు. తిరుగు ప్రయాణంలో 52 క్యూ రైలింగ్ పనులు పూర్తి చేశారు. క్యూలైన్లలో భక్తులకు ఎండ వేడి తాకకుండా చలువ పం దిళ్లు వేశారు. తాత్కాలిక బస్టాండ్ లో సిబ్బందికి బస, అలైటింగ్, బోర్డింగ్, టికెట్ కౌంట ర్లు, పార్కింగ్ స్థలం, క్యాంటీన్, సిబ్బంది అధికారులకు ప్రత్యేక వసతి, తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. అలాగే తాడ్వాయి, కామారం వద్ద ప్రత్యేకంగా ఆర్టిసి బస్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. 

బ్రేక్ డౌన్ లేకుండా సేవలు

మేడారం జాతరకు నడిపే ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో బ్రేక్ డౌన్లు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. వరంగల్ నుండి మేడారం వరకు నాలుగు చోట్ల ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బస్సుల్లో సాంకేతిక సమస్య ఏర్పడితే ఎక్కడికక్కడే మరమ్మత్తులు నిర్వహించడానికి మేడారం, తాడువాయి, పస్రా, గట్టమ్మ వద్ద మెకానికులను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే మార్గమధ్యలో బస్సులు నిలిస్తే ప్రత్యేకంగా పెట్రోలింగ్ టీం లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో టీంలో ఒక మెకానిక్ ఎలక్ట్రిషన్ ఇద్దరు సిబ్బంది ఉంటారని, ద్విచక్ర వాహనాలపై ఆయా మార్గాలు తిరుగుతూ నిరంతరం బస్సుల రాకపోకలను, బస్సుల కండిషన్ తీరును పరిశీలిస్తారని చెప్పారు. అలాగే మార్గమధ్యలో బస్సులు ఆగిపోతే ట్రాఫిక్ కు జామ్ కాకుండా వాటిని పక్కకు తొలగించడానికి రెండు క్రేన్లను, ఐదు ట్రాక్టర్లను అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. 

51 కేంద్రాల నుంచి మేడారం జాతరకు బస్సు సౌకర్యం

మేడారం మహా జాతర కు వరంగల్, కరీంనగర్, ని జామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం రీజియన్ల పరిధి లోని 51 కేంద్రాల నుంచి ఈ నెల 25 నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సు సౌకర్యం ప్రారంభిస్తున్నట్లు ఆర్‌ఎం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 25 కేంద్రాల నుండి మేడారం జాతరకు బస్సులు నడపనున్నట్టు చెప్పారు. మ హిళలకు ఈసారి జాతరలో కూడా మ హాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం విజయభాను చెప్పారు.

డీ.విజయ భాను, ఆర్టీసీ ఆర్‌ఎం, వరంగల్