ఆర్టీసీ భద్రత.. భరోసా!
- బస్సుల్లో నిఘా నేత్రాలు
- వేధింపులు, దొంగతనాలకు చెక్
- పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్‌లో ప్రారంభం
- ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో అమలుకు చర్యలు
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): ప్రయాణికుల భద్రతకు, సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ప్రమాదాలు, చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూసేందు కు బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ బస్సులో భరోసా పేరిట రూపొందించిన ఈ సరికొత్త హైటెక్ భద్రతా ప్రాజెక్టును తొలి దశలో ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో ఈ అత్యాధునిక నిఘా నేత్రాలను తొలుత అమర్చారు. కెమెరాలను డ్రైవర్ క్యాబిన్ సమీపం, మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక సీట్లు, ఫుట్‌బోర్డుతో పాటు బస్సు లోపల చివరి సీటు వరకు ప్రతి అంగుళం స్పష్టంగా కనిపించేలా అమర్చారు.
కంట్రోల్ రూమ్‌కు అటాచ్
బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న సంఘటన అన్నీ ఇందులో రికార్డు అవుతాయి. ఈ విజువల్స్ అటు డ్రైవర్, కండక్టర్లకు అందుబాటులో ఉండటమే కాకుండా ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా కనెక్ట్ చేశారు. దీనివల్ల బస్సుల్లో దొంగతనాలు చేసే ముఠాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ముందే గుర్తించి అప్రమత్తం కావడానికి, ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా ప్రమాదం జరిగితే తక్షణమే ఖచ్చితమైన ఆధారాలను సేకరించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడనుంది.
మహిళా ప్రయాణికులపై వేధింపులు, దొంగతనాలు, అనుచిత ప్రవర్తన వంటి ఘటనలకు చెక్ పెట్టేలా టీజీఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సుదూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధుల పట్ట అనుచితంగా వ్యవహరించే వారు ఈ నిఘా కన్ను అన్ని గమనిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.
రాబోయే రోజుల్లో అన్ని డిపోల్లో
బస్సుల్లో కెమెరాల ఏర్పాటు వల్ల డ్రైవింగ్ ప్రమాణాలు మెరుగవుతాయి, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. డ్రైవర్, కండక్టర్లపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా తెలిసిపో తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సులకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం.
ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి






