ఖమ్మంలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తత
- డిపోను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు
- వైరా రోడ్డులో నల్లబ్యాడ్జిలతో భారీ ర్యాలీ..
- మద్దతు తెలిపిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీపీఐ, ప్రజా, కార్మిక సంఘాలు
ఖమ్మం, ఏప్రిల్ 24(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో మూడవ రోజు శుక్రవారం ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె ఉద్రుత్తంగా మారింది. ఖమ్మం, మధిర, సత్తుపల్లి డిపోల ఎదుట తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేశారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ ప్రభుత్వ బస్సులు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అప్పటికే బయట ఉన్న ఆర్టీసీ అద్దె బస్సులు కొన్ని ప్రధాన ప్రాంతాలకు తిరిగాయి.
ఆర్టీసీ సంస్థ, ప్రభుత్వం సమ్మె సందర్భంగా తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుని బస్సులను నడిపిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు కొన్ని రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో సమ్మె ప్రభావం ప్రయాణికులపై కొంత ప్రభావం చూపించింది. ఆర్టీసీ డీపోలో ఉన్న బస్సులు బయటకు రాలేదు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ లు బస్సులు లేక వెలవెలబోయాయి. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, అలా కాకుండా మొండిగా బస్సులను తిప్పేందుకు ప్రయత్నం చేస్తే, సమ్మెను మరింత కఠినతరం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు హెచ్చరిస్తున్నారు.
నోటికి నల్ల రిబ్బన్లతో ర్యాలీ
ఆర్టీసీ కార్మికులకు సమ్మెలో భాగంగా, ఆర్టీసీ కార్మికుడు మ్రుతికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు మూడవ రోజు నిరసన ర్యాలీ నిర్వహించారు. మూతికి నల్లరిబ్బన్లు కట్టుకుని బస్ డిపో నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. కార్మికుడు కోలా శంకర్ కు నివాళ్లు అర్పించారు. సీపీఐ జాతీయ నాయకులు భాగం హేమంత్ రావు, నాయకులు సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మొండి వైఖరి విడనాడి ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శుక్రవారం మూడవరోజు సమ్మెలో భాగంగా ఖమ్మం బస్ డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను కలిసి తన మద్దతును ప్రకటించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావులు ఆయన పాటు మద్దతు ఇచ్చారు.
మూడవరోజు సమ్మెకు తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారావు , వేణు , ఏఐపీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల వెంకన్న, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చింతల రమేష్ మద్దతు తెలియజేశారు. జేఏసీ చైర్మన్ పిల్లి రమేష్, ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాదే లక్ష్మీనారాయణ తోట రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, పగడాల మల్లేష్, టి యు సి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శిజె.రామయ్య జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, కేఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు సి వై పుల్లయ్య, పిడిఎస్ యు జిల్లా నాయకులు జి. మస్తాన్, కన్వీనర్స్ బిఎస్ రెడ్డి, ఎన్ . నాగయ్య, ఎల్ ఆర్ కే రావు, ఎం ఆర్ నాథ్, పిట్టల సుధాకర్, జేఏసీ నాయకులు అనిత, జిఎస్ రావు, బేతంపూడి బుచ్చిబాబు, రామలక్ష్మి, సుజాత, స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు, మాధవరావు , రోశయ్య పాల్గొన్నారు.






