27 March, 2026 | 3:21 AM

ఆర్టీసీ సంఘాల జంగ్

27-03-2026 01:29 AM

ఒక్కతాటిపైకి సంఘాలు

ప్రైవేటీకరణను కచ్చితంగా అడ్డుకుంటామని వెల్లడి

కార్మికశాఖ ఆధ్వర్యంలో చర్చలు విఫలమైతే.. సమ్మెకు వెళ్లనున్న కార్మికులు

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): ఉద్యోగులు భరోసాగా ఉండాలంటే.. ఉపాధి కొనసాగాలి.. ఉపాధి కొనసాగాలంటే.. సంస్థ బలంగా ఉండాలి. యాభై వేల మందికి ఉపాధి కల్పిస్తూ.. రోజూ 60 నుంచి 70 లక్షల మందిని  గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తున్న తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అందులో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు తమ ఉపాధిపై భరోసా కలిగించడంలేదు.. పైగా కంటిమీద కునుకు లేకుం డా చేస్తున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ పట్ల వ్యవహరిస్తోన్న తీరు.. సంస్థను ఏ తీరాలకు చేర్చుతుందనే చర్చ కార్మిక వర్గాల్లో కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితులు కార్మికవర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. 

భరోసాకు సర్కారు శాపం..

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల నమ్మకాన్ని, భరోసాను చూరగొన్న ఆర్టీసీ భవిష్యత్తు ప్రస్తుతం ప్రమాదంలో పడిం ది. అంశాలవారీగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్టీసీని దెబ్బతీసేలా ఉన్నాయని కార్మికులు బాహాటంగానే చెబుతున్నారు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ఒక్కొక్కటిగా ఆర్టీసీ ఆస్తులను, విభాగాలను కట్టబెట్టేలా వ్యవహరిస్తున్న సర్కారు తీరుపై వీరు కన్నెర్ర చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికివారు యమునాతీరేలా వ్యవహరించిన ఆర్టీసీ యూని యన్లు.. సంస్థకు రానున్న ప్రమాదాన్ని పసిగట్టి ఐక్యంగా కదులుతున్నారు. 

ఈవీ బస్సులతో ముడిపడిన భవిష్యత్తు..

ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి ఈవీ బస్సుల వ్యవహారంతోనే శ్రీకారం చుట్టారని ఆర్టీసీ యూనియన్లు భావిస్తు న్నాయి. మొదటి నుంచి ఉన్నట్టుగానే.. ఈవీ బస్సుల కొనుగోలు అధికారాన్నికూడా ఆర్టీసీకి కట్టబెట్టకుండా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం.. ఆపై కేంద్రం నుంచి వస్తున్న ఒక్కో బస్సుకు రూ. 36 లక్షల గ్రాంట్ ప్రైవేటు సంస్థలకే దక్కడం.. పైగా అవే బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం.. పైగా, ఈవీ బస్సుల నిర్వహణకు సదరు కార్పొరేట్ సంస్థే ఔట్ సోర్సింగ్ ద్వారా డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నీషి యన్లు, సూపర్‌వైజర్లు, అధికారులను భర్తీ చేసుకోవడం.. లాంటివి అన్నీకూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా సాగుతుందనే సంకేతాలనే స్పష్టం చేస్తోందని వారంటున్నారు. 

ఐక్యంగా ముందుకు..

ఈవీ బస్సుల వ్యవహారంతోపాటు, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించడం, పెండింగు బకాయిలు, ఉద్యోగుల భర్తీకి నోటిఫికేష న్లు, ఆర్టీసీ ఆస్థులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం.. లాంటి ప్రధాన సమస్యలను సాధించేందుకు నడుం కట్టా రు. ఇప్పటి వరకు ఒక్కొక్కరు ఒక్కో దిక్కున సాగిన కార్మిక సంఘాలు.. ఇప్పుడు కలిసికట్టుగా సాగితేగానీ.. సమస్యలు పరిష్కారం కావని గ్రహించాయి. ఆర్టీసీని బతికించుకోవాలంటే.. అందరూ కలిసి సాగాల్సిన అవసరాన్ని గుర్తించిన నేతలు.. అందరూ కలిసి ఐక్య కార్యాచరణ కమిటీ (జాక్)ని ఏర్పాటు చేసుకున్నారు.

ఇందులో భాగంగా ఈనెల 13న సమ్మె నోటీసు ఇచ్చారు. దీనితో కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగే చర్చల్లో ఈ అంశాలన్నీ తేలకుంటే.. సమ్మెకు దిగడం ఖాయంగా కనపడుతోంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడే కాదన్నట్టుగా వారి మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రైవే టు కార్పొరేట్ సంస్థల నుంచి, తెరవెనుక ఉండి నడిపిస్తోన్న రాజకీయ నేతలు, బడా వ్యాపారుల నుంచి ఆర్టీసీని రక్షించుకోవాలని.. ఆర్టీసీని రక్షించుకుంటేనే తమ జీవితాలు బాగుంటాయని గ్రహించిన రోడ్డు రవాణా ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు.. సర్కారుపై ఒత్తిడి పెంచడంలో తొలి అడుగు వేశాయి. 

వేల కోట్ల ఆస్తులపై కన్ను..

ఆర్టీసీకి రూ. వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రైవేటు పరం చేయడానికి పావు లు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈవీ బస్సులను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు తయారుచేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు కంపెనీలు ఈవీ బస్సులను తయారుచేయవచ్చు. అవి నేరుగా ప్రభుత్వమో.. ఆర్టీసీయే కొనవచ్చుకదా. అలా చేయకుండా ఆ కార్పొరేట్ సంస్థలే ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం.. పైగా ఆర్టీసీ యే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేసి డిపోలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేలా నిర్ణయాలు తీసుకోవడంతో.. ఇదంతా ప్రైవేటీకరణలో భాగంగానే చేస్తున్నట్టు బల మైన అనుమానాలున్నాయి. ఎలాగైనా ఆర్టీసీని కాపాడుకోవాలి. అందుకే మా పోరాటం.

 మారంరెడ్డి థామస్‌రెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి,

ఆర్టీసీ జాక్ వైస్ ఛైర్మన్

ఈవీ బస్సులుగా మార్చే శక్తి మాకుంది..

ఆర్టీసీలో దశాబ్దాల చరిత్ర ఉన్న వర్క్‌షాప్‌లున్నాయి. ఒకప్పుడు అశోక్‌లే లాండ్ బస్సులతో మేం పోటీపడ్డాం. డీజిల్ బస్సుల ను ఈవీ బస్సులుగా మా ర్చుకోలేమా?. ఆ శక్తి మాకు ఉంది. దీనికి చిన్నపాటి శిక్షణ సరిపోతుంది. ఆర్టీసీలో ఉన్న వేలా ది డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చితే.. కొత్త బస్సుల భారం ఆర్టీసీపై ఉండదు. ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. పైగా డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చేందుకు ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంటే ప్రైవేటీకరణలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్టు గా అర్థమవుతోంది. అందుకే మేం ప్రత్యక్షంగా పోరాటానికి దిగుతున్నాం. ఆర్టీసీని రక్షించుకోవాలంటే పోరాటం చేయక తప్పని పరిస్థితిలో ఉన్నాం.

 ఎ రాంచంద్రారెడ్డి (ఏఆర్‌రెడ్డి), టీఎంయూ ప్రెసిడెంట్

రజాకార్ల పాలన.. బ్రిటిషర్ల పాలన 

ఆర్టీసీని రక్షించడానికి ఎన్నో మేనిఫె స్టోలో పెట్టారు. కానీ ఒక్కటికూడా అమలుచేయడం లేదు. 12 ఏం డ్లుగా ఒక్క భర్తీ లేదు. ఉన్న ఉద్యోగులు, కార్మికులకు మనుగడలేకుండా చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం రజాకార్ల పాలనచేస్తే.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిషర్ల పాలనచేస్తోంది. ఆర్టీసీ కార్మికులతో చెలగాటం ఆడటం సరైందికాదు.

ఆర్టీసీ కార్మికులతో చెలగాటం ఆడితే ప్రభుత్వాలు పడిపోయిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. కనీసం మా సమస్యలను చెప్పుకోవడానికి కూడా గొంతు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తోంది. గత ప్రభు త్వం యూనియన్లను రద్దుచేస్తే.. ఈ ప్రభుత్వంకూడా అదే పద్ధతిలో వెళుతోంది. ని జం చెప్పాలంటే ప్రమాదకరంగా ఈ ప్రభుత్వ పాలన ఉంది. దీనిపై మా పోరాటంలో భాగంగానే సమ్మె నోటీసు ఇచ్చాం.

 ఈదురు వెంకన్న,

ఈయూ జనరల్ సెక్రెటరీ,

ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్

ఆర్టీసీని రక్షించరెందుకు..

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణాలను ప్రకటించారు. అందుకు ఆర్టీసీ పూర్తిగా సహకరిస్తోంది. ప్రభుత్వానికి ఆర్టీసీ వల్లే పేరు వస్తోంది. మరి అలాంటి ఆర్టీసీని రక్షించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రతి నెలా రూ. 350 నుంచి 400 కోట్ల వరకు మహిళా ప్రయాణాలు జరుగుతున్నాయి. ఇందులో కేవలం రూ. 250 నుంచి 280 కోట్ల వరకు మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. ఇలా ఇప్పటివరకు రూ. 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి.

ప్రభుత్వానికి పేరు తెస్తున్న ఆర్టీసీపై చిన్నచూపు చూస్తూ.. కార్పొరేట్ సంస్థలకు లాభం కలిగేలా ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదు. ఈవీ బస్సులను నేరుగా కొనుగోలు చేసే అధికారాన్ని ఆర్టీసీకి ఇవ్వవచ్చు. కానీ అలా కాకుండా.. ప్రైవేటు సంస్థలకు ఇచ్చి అవే బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం, ఆ బస్సుల నిర్వహణకు ప్రైవేటు సంస్థ ఉద్యోగులను నియమించుకోవడం.. ఇదంతా, ఆర్టీసీని ప్రైవేటీకరించడానికే. కచ్చితంగా ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.

 సుద్దల సురేష్, బీడబ్ల్యూయూ (బహుజన వర్కర్స్ యూనియన్)

 జనరల్ సెక్రెటరీ, జాక్ కో కన్వీనర్