20 April, 2026 | 1:45 AM

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

20-04-2026 12:00 AM

గజ్వేల్  క్రైమ్ సీఐ ముత్యం రాజు 

ఇన్ స్పురై గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా 3 కే రన్

గజ్వేల్, ఏప్రిల్ 19: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకొని ఇన్ స్పురై గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 3కే రన్ నిర్వహించారు. ఫౌండేషన్ మూడో వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ రన్లో యువతి యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాల వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, డ్రగ్స్కు దూరంగా ఉండాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. గజ్వేల్ అదనపు సి.ఐ ముత్యం రాజు ముఖ్య అతిథిగా హాజరై 3 కే రన్ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ముందస్తుగా అవగాహన కల్పించడం చాలా అవసరనన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో చైతన్యాన్నిపెంపొందిస్తాయన్నారు. మరో సందర్భంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాలి.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. రన్ ముగిసిన అనంతరం విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రశంస పత్రాలు అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్, డాక్టర్ నరేష్ బాబు, డాక్టర్ లింగం,టీచర్ మల్లికార్జున్, ఇన్ స్పురై గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సమాజంలో నిరంతర అవగాహన కార్యక్రమాలు అవసరమన్నారు, ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, వైద్యులు,పోలీస్ సిబ్బంది, మహిళలు, ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.