6 April, 2026 | 2:45 AM

హేమాచలానికి భక్తుల తాకిడి

06-04-2026 12:37 AM

మంగపేట, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో రెండు తెలుగు రాష్టాలలోని పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హేమాచలానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని, తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు చేసిన లక్ష్మీనృసింహ స్వామి నామస్మరణతో హేమాచల క్షేత్రం మారు మ్రోగిపోయింది. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఆలయ సమీపంలోని దైత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి విచ్చేసిన భక్తుల గోత్ర నామాలతో పూజలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖరశర్మ, అర్చకులు కారంపూడి పవన కుమారాచార్యులు, ఈశ్వరచంద్ శర్మ తదితరులు పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, ఆలయ చరిత్రను, శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి మహిమలను వివరించారు. ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన సత్రంలో భక్తులు భోజనాలు చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లను చేశారు.