విద్యార్థుల భవిష్యత్‌కు తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం
కేసముద్రం, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల మాత్రమే కాదు, తల్లిదండ్రుల పాత్ర కూడా అత్యంత కీలకమని, పిల్లల చదువుపై నిరంతర శ్రద్ధ, వారి ప్రవర్తనపై పర్యవేక్షణ, సాంకేతిక వినియోగంపై నియంత్రణ వంటి అంశాలలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ సూచించారు. కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్లో ఆదివారం తల్లిదండ్రుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.
పాఠశాల ప్రత్యేకతలను వివరించిన ఆయన, నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, విలువల ఆధారిత బోధనతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరాల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డిజిటల్ లెర్నింగ్ విధానాలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల తల్లిదండ్రులు కలసి ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చిర్ర నరేష్, గడ్డమీది ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.




