calender_icon.png 5 December, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాణిజ్యాన్ని మరింత పెంచుకుంటాం: పుతిన్

05-12-2025 03:39:29 PM

న్యూఢిల్లీ: భారత్, రష్యా స్నేహసంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin) అన్నారు. ఈ పర్యటన సందర్భంగా భారత్, రష్యా కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. పుతిన్ మీడియాతో మాట్లాడుతూ... మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. భారత్ తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఒప్పందంలో వాణిజ్యం, సాంకేతికత కీలక ప్రాధాన్యతని తెలిపారు. ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకున్నామని సూచించారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వ్యాపారం లక్ష్యమన్న పుతిన్ ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక అంశాల్లో పరస్పర సహకారం ఉంటుందన్నారు. రష్యా నుంచి భారత్ వచ్చే పర్యాటకులకు వీసాలో వెలుసుబాటు, ఇరు దేశాల క్రీడాకారులు, విద్యార్థుల మధ్య పరస్పర సహకారం ఉందన్నారు.

భారత్, రష్యా రవాణా అనుసంధానం పెంచడం తమ లక్ష్యమన్నారు. భారత్-రష్యా మధ్య 64 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందని పుతిన్ వెల్లడించారు. ఇరుతేశాల మధ్య ట్రేడ్ మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సొంత కెరెన్సీల్లోనే ఇరుదేశాల మధ్య వాణిజ్యం జరుగుతుందని చెప్పారు. ఆయిల్ సహా అన్ని రంగాల్లో సహకారానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. కొడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు రష్యా సహకరిస్తోందన్నారు. విద్యుత్ రంగంలో ఖర్చు తగ్గించుకోవడానికి కావాల్సిన సాయం అందిస్తామన్నారు. హైక్వాలిటీ మెడిసిన్ డ్రగ్స్ విషయంలో భారత్ తో కలిసి పనిచేస్తామని చెప్పారు. మోడీతో చర్చలు ఫలప్రదమయ్యాయన్న పుతిన్ భారత్-రష్యా మధ్య స్వేచ్ఛా వాణిజ్య జోన్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భారత ఇంధన రంగ అభివృద్ధికి కావాల్సిన చమురు, గ్యాస్, బొగ్గు అంశాల్లో సహకారానికి సిద్ధమన్నారు. మేకిన్ ఇండియాకు తమ మద్దతు ఉంటుందన్నారు. వచ్చే ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం నిర్వహిస్తామన్నారు. తనకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులు, ప్రధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక కృతజ్ఞతలు పేర్కొన్నారు.