05-12-2025 04:35:02 PM
మహిళా శక్తి బలపడితే మహబూబ్‌నగర్ బలపడుతుంది: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహిళా సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని మహబూబ్‌నగర్‌లో అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో గృహిణులు, అవివాహిత మహిళలకు ఎమ్మెల్యే తన స్వంత నిధులతో ఉచితంగా అందిస్తున్న నైపుణ్య శిక్షణకు సంబంధించిన మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత మూడు బ్యాచ్‌లలో శిక్షణ పొందిన సుమారు 1000 మంది మహిళలు తమ తమ రంగాల్లో స్థిరపడటం మహబూబ్‌నగర్‌లో మహిళా ఆత్మవిశ్వాసానికి నిదర్శనమన్నారు.
ఈ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మాత్రమే పొందలేదు, ఇతరులకు ఉపాధి కల్పిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థలో కొత్త ప్రేరణగా మారారు అని చెప్పారు. “మహిళలను ఆర్థికంగా బలపరచడం తన సంకల్పమని స్పష్టం చేశారు. మహిళా శక్తి బలపడితే మహబూబ్‌నగర్ బలపడుతుందన్నారు. శిక్షణ, నైపుణ్యం, ఉపాధి ఇవి మూడు కలిసి వారి జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకొస్తాయని చెప్పారు. మహబూబ్‌నగర్ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు, వచ్చే 10 ఏళ్లలో 20 వేల మందికి నైపుణ్య శిక్షణ అందించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.
అలాగే మహిళలు స్వయం సమృద్ధిగా మారడం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి, నగర అభివృద్ధి, సమాజ ప్రగతి ఏకకాలంలో ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ మహిళల కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాలు సమాజ మార్పుకు, మహిళా అభివృద్ధి ఉదాహరణగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, ఎమ్మెల్యే పిఎ అనిల్, మహబూబ్‌నగర్ ఫస్ట్ ఇంచార్జీ నిజలింగప్ప , మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ప్రశాంత్, అంజద్, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.