18 April, 2026 | 3:01 AM

రైతు భరోసా 20న రెండో విడత

18-04-2026 01:37 AM
  1. నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి 
  2. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి 
  3. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఈనెల 20న రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు.

ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బరాజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారని, అనంతరం కాటారం మండలం నస్తూరిపల్లిలో రైతు సోదరుల కోసం నిర్వహించే కార్యక్రమంలో రైతు భరోసా రెండో విడత నిధులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి విడుదల చేస్తారని తెలిపారు.

శుక్రవారం భూపాలపల్లి ఐడీవోసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కాన్‌సింగ్‌రాజ్ ఠాకూర్, జిల్లా అధికారులతో మంత్రి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, ఆ దిశగా రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని భూపాలపల్లి నుంచి ప్రారంభించడం గర్వకారణమని తెలిపారు.

ఇదే సం దర్భంలో నస్తూరిపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తు న రైతులు, మహిళలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లా యంత్రాంగం సమగ్ర ఏర్పా ట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అటవీ శాఖ అధికారి నవీన్‌రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అ శోక్‌కుమార్,  విజయలక్ష్మి, ఏఎస్పీ నరేశ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, కౌన్సిలర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.