19 June, 2026 | 3:25 AM

రూ.3,301 కోట్లు చెల్లించాం

19-06-2026 02:19 AM
  1. రెండేళ్లలో 66,038 కుటుంబాలకు లబ్ధి
  2. ‘రైతుబీమా’తో రైతుకుటుంబాలకు భరోసా
  3. పథకాలను నిలిపివేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే  
  4. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : రైతు మరణించిన సందర్భంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం అత్యంత బాధ్యతతో అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. రెండున్నరేళ్ల కాలంలోనే 66,038 రైతు కుటుంబాలకు రూ. 3,301.90 కోట్ల బీమా చెల్లించినట్లు గురువారం ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. రైతుబీమా పథకాన్ని నిలిపివేసినట్లు బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం అసత్యమన్నారు.

తమ ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే ఏ ఒక్క పథకాన్ని నిలిపివేసిన దాఖలాలు లేవన్నారు. పథకాలను నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేసిన చరిత్ర గత ప్రభుత్వానిదే అని దుయ్యబట్టారు. గత సర్కార్ రైతులకు ఉపయోగపడే వ్యవసాయ యాంత్రీకరణ, సాయిల్ హెల్త్ టెస్ట్, సబ్సిడీ విత్తనాలు వంటి పథకాలను నిలిపివేసిందన్నారు.  రాష్ట్ర వాటాను విడుదల చేయకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలను సైతం రైతులకు దూరం చేసిందని విమర్శించారు.

2023లో 20,090 కుటుంబాలకు రూ.1,004.50 కోట్లు, 2024లో 25,861 కుటుంబాలకు రూ.1,293.05 కోట్లు బీమా అందించినట్లు వివరించారు. 2025--26 సంవత్సరానికి రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు రైతుబీమా పథకంలో నమోదయ్యారని, వీరందరికీ వర్తించేలా ఎల్‌ఐసీకి వార్షిక ప్రీమియం రూ.1,359.56 కోట్లు ప్రభుత్వమే పూర్తిగా చెల్లించిందన్నారు.  రైతు సంక్షేమం విషయంలో రాజీ పడబోమని మంత్రి స్పష్టం చేశారు.