6 May, 2026 | 7:14 PM

పట్వారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

06-05-2026 06:42 PM

దమ్మపేట,(విజయక్రాంతి): బుధవారం పట్వారిగూడెం లో రైతు ముంగిట్లో శాత్రవేత్తలు శిక్షణా కార్యక్రమాన్ని వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఇంచార్జి శాస్త్రవేత్తలైన డా బి. జాంబమ్మ, డా. ఆర్. శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ యూరియా వినియోగాన్ని తగ్గించుకోవాలని, సాగు ఖర్చులను తగ్గించుకోవాలని, భూసారాన్ని పెంచుకోవాలని, అవసరం మేరకు రసాయనాలను వాడాలని, సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలని, నీటి వినియోగాన్ని పెంచుతూ, నీటి ఆదా చేపట్టాలని సూచించారు.

అదే విధంగా పంట మార్పిడి పద్ధతులను చేపట్టి సుస్థిర ఆదాయాన్ని పొందాలని, మార్కెట్ డిమాండ్ ఉన్న  వరి రకాలను మాత్రమే సాగుచేయాలని సూచించారు. డా. జాంబమ్మ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయం లో రైతులు యాంత్రీకరణ వైపు మళ్ళాలని, ఆయిల్ పామ్ సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి, మంచి దిగుబడులను సాధించాలని, రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకొని, లాభసాటి వ్యవసాయం చేయాలని కోరారు.

అనంతరం చెలికాని ప్రసాదరావు 12 ఎకరాల ఆయిల్ పామ్ తోటలో క్షేత్ర సందర్శన చేసి పోషక, తెగుళ్ళ గురించి  శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్వారిగూడెం సర్పంచ్ కూరం అర్జున్ రావు, ఉప సర్పంచ్ బొల్లికొండ నాగేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారి డి. కేశవరావు, అంకంపాలెం సర్పంచ్ మోకాళ్ళ గురుమూర్తి, జగ్గారం సర్పంచ్ వంకా జానకిరాం, రైతులు సూరిబాబు, రామకృష్ణ, కృష్ణారావు, వెంకటరావు, వసంతరావు, వెంకటేశ్వరరావు, నరేష్ రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.