09-01-2026 12:00:00 AM
వరంగల్ రీజనల్ మేనేజర్ విజయభాను
హనుమకొండ టౌన్, జనవరి 8 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరంగల్ రీజనల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసిందని వరంగల్ రీజనల్ మేనేజర్ డి. విజయభాను తెలిపారు. జనవరి 9 నుండి 13 వరకు హైదరాబాదులోని ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి హనుమకొండ, వరంగల్ వైపుకు సుమారు 650 బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నామన్నారు.
ఉప్పల్ వద్ద ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని ప్రయాణికుల కోసం అక్కడ తాత్కాలికంగా బస్సు షెల్టర్ (టెంటు), త్రాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లు చేశామని అలాగే పండుగ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం కోసం జనవరి 16 నుండి 20 వరకు హనుమకొండ నుండే కాకుండా నర్సంపేట, మహబూబాద్, తొర్రూర్, జనగామ, పరకాల, భూపాలపల్లి బస్టాండ్లలో కూడా రద్దీని క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్టీసీ ఈ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని కావున మహిళలందరూ సిబ్బందికి సహకరించాలని తెలిపారు.