20 June, 2026 | 1:44 AM

ఒకటో తేదీనే వేతనాలు!

20-06-2026 12:00 AM
  1. రెగ్యులర్ ఉద్యోగుల్లాగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సైతం..
  2. జాప్యం జరిగితే బాధ్యులైన అధికారులపై చర్యలు
  3. ఆదేశాలు జారీ 

సంగారెడ్డి, జూన్ 19 (విజయక్రాంతి) : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, తదితర ఉద్యోగుల కు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో కలిపి వారికి కూడా స కాలంలో చెల్లించాలని సూచించింది. ఈ నెల 9న ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ నుం చి అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ప్రభు త్వం సర్క్యులర్ జారీ చేసింది.

జూలై నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నారు. జిల్లా లో రెగ్యులర్ ఉద్యోగులు 8,500 నుండి 10వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 12వేల నుండి 15 వేల మంది వరకు తాత్కాలిక సిబ్బంది ఉ న్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతినెలా 1న గత నెలకు సంబంధించిన జీతాలను అ న్నివర్గాల ఉద్యోగులకు చెల్లించాలి.

ప్రస్తుతం అదేవిధంగా విడుదల అవుతున్నప్పటికీ వివి ధ కారణాలతో ఆలస్యం జరుగుతుందనే అభిప్రాయం ఉంది. పే బిల్లుల ఆలస్యం, హాజరు నమోదు, తనిఖీలు, ఆడిట్, బిల్లుల ఆమోదంలో జాప్యం వంటి కారణాలతో ఉద్యోగులకు సకాలంలో జీతాలు, వేతనాలు అందని పరిస్థితి ఉంది. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆలస్యమైతే బాధ్యులపై చర్యలు.. 

రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గౌరవ వేతనంపై పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి జీతాలు, వేతనాలు ఆలస్యం కా కుండా చెల్లించాలని, జాప్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభు త్వం ఆదేశించింది. ప్రతినెలా గతనెల 21వ తేదీ నుంచి ప్రస్తుత నెల 20వ తేదీ వరకు హాజరును పరిగణించాలని పేర్కొంది. 25న ట్రెజరీ విభాగానికి సంబంధిత శాఖలు బిల్లులు సమర్పించాలని ఆదేశించింది.

నెల చివరి పనిదినంలోపు బిల్లుల పరిశీలన, ఆడిట్, ఆమోద ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో సకాలంలో జమయ్యే లా ట్రెజరీ అధికారులు బాధ్యత వహించాల ని పేర్కొంది. సంబంధిత శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీవో)లకు తగిన బడ్జెట్ కేటాయింపు, అవసరమైన పరిపాలన, ఆర్థిక అనుమతులు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించింది. శాఖాధిపతులు ఈ విషయంలో పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేసింది. ఆలస్యమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

రెగ్యులర్‌గా అందిస్తున్నాం..

సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 384 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన విధంగా ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తున్నాం. గతంలో కూడా వేతనాలకు ఇబ్బంది లేకుండా చెల్లించాం. కొన్ని మున్సిపాలిటీల్లో వేతనాలు ఆలస్యంగా అందుతున్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై వారికి వారి ఖాతాల్లో నేరుగా వేతనాలు చెల్లించడం జరుగుతుంది.

 శ్రీనివాస్రెడ్డి, కమిషనర్, సంగారెడ్డి మున్సిపాలిటీ