20 June, 2026 | 2:37 AM

హాల్ టికెట్, ఐడీ ప్రూఫ్ తప్పనిసరి

20-06-2026 12:00 AM
  1. పెన్నును కూడా పరీక్ష కేంద్రంలోనే అందజేస్తారు
  2. పరీక్ష కేంద్రం వద్ద సెక్షన్163 BNSS అమలు
  3. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: 
  4. ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

మెదక్, జూన్ 19(విజయక్రాంతి) : మెదక్ జిల్లాలో ఈ నెల 21న నిర్వహించనున్న NEET (UG)2026 ప్రవేశ పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మెదక్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం పరిసరాల్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS)2023లోని సెక్షన్163 అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పరీక్ష రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష కేంద్రం పరిసరాల్లో ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలవడం, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, మైకులు, డీజేలు వంటి ధ్వని విస్తరణ పరికరాల వినియోగం పూర్తిగా నిషేధం అని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశం ఉంటుందని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తెలిపారు.

అందువల్ల విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (ఐడీ ప్రూఫ్) మాత్రమే వెంట తీసుకురావాలని, పరీక్షకు అవసరమైన పెన్నును కూడా పరీక్ష కేంద్రంలోనే అందజేస్తారని తెలిపారు.

మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ వాచీలు, కాలిక్యులేటర్లు, బ్లూటూత్ పరికరాలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు ప్రజలు, తల్లిదండ్రులు, సంఘాల ప్రతినిధులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.