అంగన్‌వాడీలకు వేతనాలు పెంపు
- ప్రమోషన్లు పారదర్శకతతో చేపడతాం
- పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ఇస్తాం
- శాసనమండలిలో మంత్రి సీతక్క
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను రూ.18వేలకు పెంచుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సూపర్‌వైజర్లకు సీనియార్టీ ప్రకారం పదోన్నతి ఇచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. ఈ పోస్టులకు గత ప్రభుత్వాలు పరీక్షల ద్వారా ఎంపిక చేసేవని గుర్తు చేశారు.
గురువారం శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు కవిత, రవీందర్‌రావు, తాతా మధు, వాణిదేవి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. అంగన్‌వాడీ టీచర్లకు సకాలంలో వేతనాలు అందిస్తున్నామని.. రెండు, మూడు నెలలుగా ఆలస్యమవుతోందన్నారు. రైతు రుణమాఫీకి నిధుల కేటాయింపుతో ఆర్థిక సమస్యలు తలెత్తాయని.. త్వరలో వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు చెప్పారు.
సెంటర్లను అప్‌గ్రేడ్ చేసే విషయం కూడా పరిశీలిస్తున్నామని, కొన్ని సెంటర్లను ప్రాథమిక స్కూళ్లలోకి మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా తాము ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలు ఇస్తామని, అద్దె భవనాలకు త్వరలో బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు.
అదేవిధంగా బీఆర్‌ఎస్ సభ్యులు కవిత, మహమూద్ అలీ అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ.. ప్రతినెలా ఇమామ్, మాలాన్‌లకు నెలవారీగా గౌరవ వేతనం రూ. 5వేలు చెల్లిస్తున్నామని చెప్పారు. గతేడాది నవంబర్‌లో రూ.6.86 కోట్లు, డిసెంబర్‌లో రూ.6.86 కోట్లు, 2024 జనవరిలో రూ.7 కోట్లు, ఫిబ్రవరిలో రూ.7.10 కోట్లు, మార్చిలో రూ.7.20 కోట్లు, ఏప్రిల్‌లో రూ.7.30 కోట్లు, మేలో రూ.7.44 కోట్లు, జూన్‌లో రూ.7.51 కోట్లు, జూలైలో రూ.7.59 కోట్లు చెల్లించినట్టు వివరించారు.
ఆర్థిక భారంతో ఆగస్టు నుంచి చెల్లించలేదని.. వాటిని జనవరిలో విడుదల చేస్తామని ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు కొత్తగా ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం 21 మైదాన ప్రాంతం జిల్లాలకు వర్తింపజేస్తూ హైదరాబాద్‌లోని ఐటీడీఏ ఫెయిన్ ఏరియా పనిచేస్తుందన్నారు.
శ్రీశైలం ఐటీడీఏలో భాగమైన మన్ననూరు ఐటీడీఏను రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ తరువాత ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లాలకు అదనంగా పీవీటీజీలు, చెంచులు నివసిస్తున్న వికారాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో తమ కార్యకలాపాలు విస్తరించే విషయం పరిశీలనలో ఉందన్నారు.
నాడు బకాయిలు.. నేడు బుకాయింపులు
బీఆర్‌ఎస్ పాలనపై మంత్రి సీతక్క ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అప్పులు చేసి, ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. గురువారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. అప్పుడు బకాయిలు పెట్టి ఇప్పుడు బుకాయిస్తున్నారని విమర్శించారు. నాడు బంగారు తెలంగాణ అని ఇప్పుడు రోజుకో వేషం వేసుకుని అసెంబ్లీకి వస్తున్నారని ఎద్దేవాచేశారు.
బీఆర్‌ఎస్ బాటలోనే బీజేపీ కూడా నడుస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తుందని ఆరోపించే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో 120 లక్షల కోట్ల అప్పులు చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తుంది.. కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాత్రం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కాళ్లు అరిగేలా తిరిగినా రూపాయి కూడా ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలను పార్లమెంట్‌కు పంపారని, వారు కేంద్రప్రభుత్వంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు.






