24 April, 2026 | 4:22 PM

మూసీ సుందరీకరణకు డీపీఆర్‌లు ఇవ్వలే

20-12-2024 12:32 AM
  1. మా ప్రతిపాదన ప్రిలిమినరీ దశలోనే ఉంది
  2. అర్థం చేసుకోకుండా బీఆర్‌ఎస్ రాద్ధాంతం చేస్తోంది
  3. రివర్ బెడ్, బఫర్ జోన్‌లో పట్టాలుంటే పరిహారం ఇస్తాం
  4. మూసీ నిర్వాసితుల పునరావాస చర్యలకు కట్టుబడి ఉన్నాం
  5. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): మూసీ రివర్ ఫ్రంట్‌కు సంబంధించిన డీపీఆర్‌లను ప్రపంచ బ్యాంక్‌కు సమర్పించలేదని  ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.4,100 కోట్ల ప్రతిపాదనలు మూసీ ప్రక్షాళన ప్రతిపాదనలు కావని.. మూసీకి ఇరువైపులా ట్రంక్ సివరేజీ లైన్లు కావాలని మెట్రో వాటర్ బోర్డు పంపిన ప్రతిపాదనలని స్పష్టం చేశారు.

వరల్డ్ బ్యాంక్ రుణం ఇవ్వాలంటే ఆరు స్థాయిల్లో పరిశీలన చేసి ఇస్తుందని, తాము వారికి దరఖాస్తు చేసింది ప్రిలిమినరీ దశలోనే ఉన్నదన్నారు. దీనిని అర్థం చేసుకోలేక తమపై రాద్ధాంతం చేయడం బీఆర్‌ఎస్ కుట్రేనన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల విషయంలో 11శాతం వడ్డీతో అప్పులు తెచ్చిందని, ప్రపంచ బ్యాంక్ తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుండటంతో అప్పు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి ప్రపంచ బ్యాంక్‌కు తాకట్టు పెడుతున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. మూసీ పునరుజ్జీవనం అంశంపై గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులకు మంత్రి సమాధానమిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళనలో చెప్పిన లక్షన్నర కోట్ల ఖర్చులో..

ఓఆర్‌ఆర్ వరకు చేపట్టాల్సిన రోడ్లు, కారిడార్లు, లింక్ రోడ్లు, ఎఫ్టీసీలు, గోదావరి నీటి తరలింపు, మెట్రో విస్తరణ, మూసీ నిర్వాసితులకు సహాయ, పునరావాసాలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. మూసీ బఫర్‌జోన్‌ను గత ప్రభుత్వమే 50 మీటర్లకు పెంచిందని గుర్తు చేశారు. రివర్ బెడ్ నిర్వాసితుల సంఖ్యను 7వేలకు చూపించగా, బఫర్ జోన్‌లో నిర్వాసితుల సంఖ్యను 2,108గా గుర్తించామని..

ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగిందన్నారు. 2,116 ఇండ్లు రివర్ బెడ్‌లో ముంపునకు గురవుతున్నాయని, వాటిలో 309 ఇండ్లకు కలెక్టర్ ఇన్సెంట్ ఇచ్చారని, 715 ఇళ్లు బఫర్‌జోన్‌లో గుర్తించామన్నారు. రివర్ బెడ్‌లో కట్టుకున్న ఇండ్లకు మానవీయ కోణంలో డబ్బులు అందజేస్తామని మంత్రి చెప్పారు.

గత ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నామమాత్రంగా డబుల్ ఇండ్లను అసంపూర్తిగా నిర్మిస్తే తాము వాటిని పూర్తి చేసి పేదలకు, నిర్వాసితులకు అందిస్తున్నామన్నారు. రివర్ బెడ్, బఫర్ జోన్‌లో పట్టాలుంటే 2013 భూసేకరణ చట్టం మేరకు పరిహారం అందిస్తామన్నారు.

ఔటర్ పరిధిలో ఉన్న ఎస్టీసీలు, పరిశ్రమలతో నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ రాష్ర్ట అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. మూసీ పునరుజ్జీవం నిర్వాసితులకు సంబంధించి తమ ప్రభుత్వం అన్ని సహాయ, పునరావస చర్యలకు కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.