21 July, 2026 | 12:34 PM

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలి

21-07-2026 01:55 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 

జనగామ, జులై 20 (విజయక్రాంతి): నకిలీ ఎరువులను కాకుండా , నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కొడకండ్ల మండలం గిర్నీ తండా లో గల  శ్రీ అభయ్ ఫర్టిలైజర్  షాప్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ షాప్ లైసెన్స్ పత్రాలను, కొనుగోలు రిజిస్టర్ పరిశీలించారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. 

ఈ పాస్ యంత్రం లో నమోదు అయిన కొనుగోలు వివరాలు, ప్రస్తుతం నిల్వ గల యూరియా బస్తాల సంఖ్య లో ఉన్న తేడా ని కలెక్టర్ గమనించి.. దీనికి సంబందించిన వివరణ ఇవ్వాలని.. మండల వ్యవసాయ అధికారి కి కలెక్టర్ ఆదేశించారు.  మున్ముందు ఇలాంటి తేడా లు రాకుండా ఎప్పటికప్పుడు తనిఖీ లు చేస్తూ.. స్టాక్ వివరాలు, అమ్మకం వివరాలు సరిగ్గా ఉండేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఎరువుల నిల్వలు, సరఫరా, విక్రయాల వివరాలు అన్నీ యూరియా యాప్ ద్వారా జరగాలన్నారు. స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డును తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.

నకిలీ విత్తనాలు లేదా కల్తీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.  జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  సరిపడా నిల్వలు ఉండేలా  డీలర్లు, వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.  ఎరువుల సరఫరా, అమ్మకాల పైన నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. జిల్లాలో ఎరువుల అందుబాటుపై వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలన్నారు.