ఏ ఇంటి బంగారమో..?

29-04-2024 12:05:00 AM

గతేడాది ‘ఖుషి’ సినిమాతో వెండితెరపై తళుక్కుమన్నారు సమంత. అగ్ర కథానాయికల్లో ఒకరైన ఆమె అటుపై మరో సినిమా ఒప్పుకున్నది లేదు. ఆరోగ్య కారణాలతో కొంత కాలం విరామం తీసుకున్న సమంత నుండి ఆమె పుట్టిన రోజు (ఏప్రిల్ 28) నాడు  ఓ సినీ ప్రకటన వచ్చేసింది. సమంత ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ పేరిట ఓ సినిమా తెరకెక్కనుంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఓ మోషన్ పోస్టర్ రూపంలో వెల్లడించారు రూపకర్తలు. దానిని బట్టి ఇందులో సమంత సగటు మధ్య తరగతి గృహిణి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఓ వైపు కుక్కర్ కూతపెడుతుంటే.. మరోవైపు చేతిలో తుపాకితో దర్శనిచ్చారు ఆమె. ఇవి మినహా ఈ సినిమాకి సంబంధించి మరే ఇతర వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. మరి సమంత ఏ ఇంటి బంగారం అన్నది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. పరిశ్రమలోని అగ్ర కథానాయకుల నూతన చిత్రాల్లో ప్రస్తుతం  కథానాయికలకై అన్వేషణ జరుగుతున్న తరుణంలో, సమంత మహిళా ప్రాధన్యం గల కథతో తెరమీదికి రానుండటం గమనార్హం.