వాళ్లు ఏ రాష్ట్రంలో ఓటేస్తారో!

07-05-2024 12:42:02 AM

ఏపీ, తెలంగాణలో ఒకేరోజు పోలింగ్

రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్న మెజార్టీ సెటిలర్స్

మూడు పార్లమెంట్ స్థానాల్లో కీలకంగా మారిన సెటిలర్స్ ఓట్లు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధానప్రతినిధి, మే 6 (విజయక్రాంతి) : దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలకు కల్పతరువు హైదరాబాద్. ఉపాధి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వలన వచ్చి హైదరాబాద్ మహానగర పరిధిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు లక్షల్లో ఉంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ను మినీ భారత్‌గా పిలుస్తారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఏ ఎన్నికలు జరిగినా అందులో సెటిలర్స్ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ నుంచి వలస వచ్చి హైదరాబాద్ మహానగర పరిధిలో సెటిల్ అయిన సెటిలర్స్ ఓట్లు అత్యంత కీలకం. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాలలో సెటిలర్ల ఓట్లు సుమారు 30లక్షల వరకు ఉంటాయి. పోలింగ్ గడువు ముంచుకోస్తుండటంతో సెటిలర్ల ఓట్లపై మళ్లీ చర్చ మొదలైంది. సెటిలర్ల ప్రభావం   ఎక్కువగా ఉన్న పార్లమెంట్ స్థానాల పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు సెటిలర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యా రు. మల్కాజగిరి పార్లమెంట్ పరిధిలో సుమారు 14 లక్షల మంది వరకు ఓటర్లు ఉండగా, చేవెళ్లలో సుమారు 6లక్షల వరకు సెటిలర్ల ఓట్లు ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో మరో 10లక్షల ఓట్లర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. 

సెలవులు మంజూరు కావడంతో...

సాదారణంగా ఎన్నికలతో సంబందం లేకుండా నగరంలోని చాలామంది ప్రజలు వేసవి సెలవులను ఆస్వాదించేందుకు టూర్స్‌ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుతం తెలంగాణలో పాఠశాలలకు, కళాశాలలకు వేసవి సెలవులు రావడంతో హైదరాబాద్‌లోని చాలా మంది సెటిలర్లు ఇప్పటికే సొంతూళ్లకు వెళ్లినట్లు సమాచారం. అయితే రెండు రాష్ట్రాలలో ఓటు హక్కును కలిగి ఉన్న హైదరాబాద్  సెటిలర్లు మే 13 జరిగే పోలింగ్ నాడు తమతమ ఓట్లను ఏపీలో వేస్తారా..? లేదా తెలంగాణలో వేస్తారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే హైదరాబాద్ నగరంలో ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుంది. ఈ దఫా మెజార్టీ సెటిలర్స్ ఏపీలో ఓటు వేస్తే నగరంలో పోలింగ్ శాతం మరింత దిగజారే అవకాశం ఉంది. 

ఏపీ, తెలంగాణలో ఒకే రోజు పోలింగ్

నాలుగు నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు గంప గుత్తగా పడ్డాయి. దీంతో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మొత్తం స్థానాలను (ఇబ్రహీంపట్నం మినహా) బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.  అయితే సెటిలర్స్ తెలంగాణతో పాటు ఏపీలోను ఓటు హక్కు కలిగి ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో ఒకేరోజు పోలింగ్ జరుగనుంది. అలాగే ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్  స్థానాలకు ఎన్నికలు జరుగుతు న్నాయి. ఈ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానా ల్లో ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో టీడీపీ పార్టీలతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అవసరం అయితే ఏపీలో ఓటు హక్కు కలిగి ఉన్న హైదరాబాద్ సెటిలర్లను కూడా ఏపీకి రప్పించాలనే లక్ష్యంతో ఉన్నారు.