6 March, 2026 | 1:45 AM

ఇసుక ‘లెక్క’ఎవరికి..?

06-03-2026 12:00 AM

ధర్పల్లిలో ట్రాక్టర్‌లపై ఇసుక తరలింపు వ్యవహారం

సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరిందా.. ?

గ్రామపంచాయతీ సిబ్బందితో ఇసుక రవాణా..?

ధర్‌పల్లి, మార్చి5 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా లోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధి లోని ధర్పల్లి మండల కేంద్రంలో ఇసుక లోడు ట్రాక్టర్ లో రవాణా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మండల పరిధిలో జరిగిన ఇసుక ట్రిప్పుల లెక్కల విషయంలో స్పష్టత లేకపోవడంతో గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.స్థానికుల సమాచారం ప్రకారం మండల పరిధిలో సుమారు 50 ట్రాక్టర్లు వాగుల నుంచి ఇసుకను రవాణా చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ట్రాక్టర్కు సగటున 5 ట్రిప్పులు చొప్పున దాదాపు 250 ట్రిప్పుల ఇసుకను తోడి రవాణా చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఈ ట్రిప్పుల ద్వారా సుమారు రూ.2,93,500 వరకు డబ్బులు వసూలు చేసినట్లు గ్రామాల్లో చర్చ సాగుతోంది. అయితే ఈ మొత్తం ప్రైవేట్గా వసూలు అయ్యిందా? లేక ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యిందా? అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇసుక రవాణా సాధారణంగా ప్రభుత్వ ఇసుక యాప్ ద్వారా జరగాల్సి ఉండగా, ఈ వ్యవహారంలో ఆ విధానం ఎందుకు పాటించలేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఇసుక పాయింట్ కేటాయించిన సమయంలో అక్కడ రెవెన్యూ శాఖ సిబ్బంది లేదా సంబంధిత అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉండాల్సి ఉండగా, ఆ స్థానంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఉండటం ఏమిటి? అనే సందేహాల ను గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల ఆరోపణల ప్రకారం అభ్యర్థుల వద్ద నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేసి, ఆ మొత్తాన్ని గ్రామపంచాయతీ స్థాయిలో కలెక్షన్ చేసినట్లు ప్రచారం జరుగుతు ఉండడంతో గ్రామస్తులు సందిగ్ధంలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో ట్రిప్పుల ద్వారా వచ్చిన డబ్బులు ఎన్ని...? వాటి తాలూకు లెక్కలు ఏమిటి? ఎవరెవరి ద్వారా వసూలు చేశారు? ఆ డబ్బులు అధికారికంగా ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయా లేదా? అనే అంశాలపై సమగ్రంగా విచారణ జరపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.                       

ఈ వ్యవహారంలో ఏమైనా అక్రమాలు జరిగాయా అనే విషయమై అధికారులు విచారణ జరపాల్సి ఉంది. ఒకవేళ అక్రమాలు జరిగితే అధికారుల విచారణలో బహిర్గతం కానుంది. ఈ విషయమై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి సరైన లబ్ధిదారులకు ఇసుక చేరేలా చర్యలు తీసుకొని వారి చెల్లించే డబ్బులు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే విధంగా అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ధర్పల్లి మండలంలో ఈ ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుల వ్యవహారం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య చర్చ నీ అంశంగా మారింది. అధికారులు స్పందించి పూర్తి వివరాలు వెల్లడిస్తేనే ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

ఇసుక అక్రమ రవాణాను ఏమాత్రం సహించబోం..

నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ఏమాత్రం సహించబోమని, అక్ర మాలకు పాల్పడితే వాహనాలను సీజ్ చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఇసుక రవాణా పూర్తిగా. ’మన ఇసుక వాహనం’. (ఆన్లైన్) ద్వారా మాత్రమే జరగాలని, ఆఫ్లైన్ అనుమతులు ఉండకూడదని తహసీల్దార్లకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాం తాల్లో కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయకుండా ఇసుక ట్రాక్టర్లలో రవాణా జరుగుతోంది.

ఆన్లైన్ తప్పనిసరి: ఇసుక బుకింగ్, రవా ణా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరగాలలేదా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తే వాహనాల సీజ్, క్రిమినల్ కేసులు నమోదు చేయబడతయి. రాత్రి వేళల్లో ఇసుక తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచి సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి. అని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాను.  పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఈ చర్యలు చేపట్టాం. 

- ఇలా త్రిపాఠి

నిజామాబాద్ జిల్లా కలెక్టర్