22 July, 2026 | 10:41 PM

రాహుల్ గాంధీ అరెస్టుకు, నీట్ పేపర్ లీక్ ఘటనకు నిరసనగా

22-07-2026 09:32 PM

కామారెడ్డిలో ప్రధాని మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మల దహనం

కామారెడ్డి,(విజయక్రాంతి): ఏఐసీసీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పిలుపుమేరకు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో గంజి గేటు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ, నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరఫున ప్రశ్నించడం నేరం కాదని, రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.