సంజూకే సై

01-05-2024 01:37:53 AM


పొట్టి ప్రపంచకప్‌నకు భారత జట్టు ప్రకటన

వైస్ కెప్టెన్‌గా పాండ్యా

పంత్ రీఎంట్రీ 

రాహుల్‌కు నిరాశ

అప్పుడెప్పుడో 2007లో తొలిసారి నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత మరో ఏడుసార్లు మెగాటోర్నీ జరిగినా టీమ్‌ఇండియా మాత్రం మరోసారి విజేత కాలేకపోయింది. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్ వంటి లీగ్‌ల్లో సత్తా చాటుతున్న మన ఆటగాళ్లు ఐసీసీ టోర్నీ అనేసరికి మాత్రం అదే స్థాయిలో ప్రభావం            చూపలేక పోతున్నారు. 

2013 చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు టీమిండియా మరో ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది. కెప్టెన్లు మారుతున్నా చాంపియన్ అనే బిరుదు మాత్రం అందని ద్రాక్షలానే మిగిలుతోంది. నిరుడు సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. వరల్డ్‌కప్ అందుకోవాలన్న కోట్లాది మంది అభిమానుల ఆశలను నిలబెట్టడంలో విఫలమైంది.

అయితే ఆ చేదు జ్ఞాపకాలను మరిపించేందుకు టీ20 ప్రపంచకప్ రూపంలో మరో అవకాశం వచ్చింది. నెల రోజుల్లో          వెస్టిండీస్, అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగ         నుండగా.. ఈసారి ఎలాగైనా కప్పుకొట్టాలనే ఉద్దేశంతో భారత సెలెక్షన్ కమిటీ సీనియర్లు, జూనియర్లతో సమతూకమైన జట్టును ప్రకటించింది. రోహిత్ సారథ్యంలోని ఈ జట్టు కరేబియన్ గడ్డపై ట్రోఫీ గెలిచి సగర్వంగా స్వదేశానికి తిరిగి రావాలని ఆశిద్దాం! 

న్యూఢిల్లీ: అభిమానులంతా ఊహించినట్లే.. వికెట్ కీపర్ సంజూ శాంసన్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ తరఫున రాణిస్తున్న శాంసన్.. కేఎల్ రాహుల్‌ను వెనక్కి నెట్టి టీ20 ప్రపంచకప్ బెర్త్ దక్కించుకున్నాడు. వచ్చే నెల 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అహ్మదాబాద్ వేదికగా బోర్డు కార్యదర్శి జై షా, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ సమావేశమై.. సుదీర్ఘ చర్చల అనంతరం మెగాటోర్నీ బరిలో దిగనున్న జట్టును ప్రకటించారు. ఈ టీమ్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అతడి డిప్యూటీగా నియమితుడయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శనను మాత్రమే పరిగణలోకి తీసుకోమని ముందే చెప్పిన బీసీసీఐ అంతకముందు అంతర్జాతీయ క్రికెట్‌లో కనబర్చిన ప్రతిభ ఆధారంగానే జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, యుజ్వేంద్ర చహల్‌లు ప్రపంచకప్ ద్వారా జట్టులోకి  రీఎంట్రీ ఇవ్వన్నారు.

2022 డిసెంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత వేగంగా కోలుకున్న పంత్ ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నాడు. పంత్‌కు బ్యాకప్‌గా సెలక్షన్ కమిటీ సంజూ శాంసన్ వైపే మొగ్గుచూపింది. దీంతో రాహుల్‌కు నిరాశ ఎదురైంది. ఏడాది నుంచి మంచి ఫామ్ కనబరుస్తోన్న శాంసన్ ఐపీఎల్లోనూ రాజస్థాన్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొడుతున్నాడు. దీంతో రాహుల్, ఇషాన్ కిషన్‌లను కాదని సంజూ చోటు దక్కించుకున్నాడు. ఇక విరాట్ కోహ్ల్లీ, సూర్యకుమార్, యశస్వి జైస్వాల్‌లు జట్టులో ప్రధాన బ్యాటర్లుగా వ్యవహరించనున్నారు. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌తో పాటు.. శివమ్ దూబే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై తరఫున విధ్వసంక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న దూబే.. చాన్నాళ్ల తర్వాత గోల్డెన్ చాన్స్ పట్టేశాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ టీమ్‌లో స్థానం నిలుపుకున్నారు. బౌలింగ్‌లో ‘కుల్చా’ జోడీపై సెలెక్టర్లు నమ్మకముంచారు. మణికట్లు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేశారు. ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు మోయనున్నారు. శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్, ఆవేశ్ ఖాన్‌లను రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.

జూన్ 9న దాయాదుల పోరు

జూన్ 2 నుంచి మొదలుకానున్న పొట్టి ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్  తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. అనంతరం జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. వెస్టిండీస్‌లోని 6, అమెరికాలోని మూడు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జూన్ 29న ఫైనల్ జరగనుంది. వరల్డ్‌కప్‌నకు ఎంపికైన ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్లో తలమునకలై ఉండగా.. తొలి బృందం ఈ నెల 21న అమెరికా బయల్దేరనుంది. ప్లే ఆఫ్స్‌కు చేరని జట్లలోని భారత ఆటగాళ్లంతా తొలి దశలోనే వరల్డ్‌కప్ కోసం వెళ్తారని బోర్డు ఇప్పటికే స్పష్టంచేసింది. కాగా.. ప్రపంచకప్‌నకు ఎంపికైన భారత ఆటగాళ్ల పేర్లను న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ భవనంపై ప్రదర్శించడం అందరిని ఆకట్టుకుంది.

భారత జట్టు: రోహిత్ (కెప్టెన్), పాండ్యా (వైస్ కెప్టెన్), జైస్వాల్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), దూబే, జడేజా, అక్షర్, కుల్దీప్, చహల్, అర్షదీప్, బుమ్రా, సిరాజ్.

రిజర్వ్ ఆటగాళ్లు: 

గిల్, రింకూ, 

ఖలీల్, ఆవేశ్.